తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  ఢిల్లీ వెళ్లారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డుమార్గంలో గన్నవరం చేరుకుని, అక్కడి 9 గంటలకు విమానంలో ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టులో సోమవారం క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై పలువురు జాతీయ నేతలను కలిశారు. పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ ముందు ఆందోళనకు దిగారు. 

నిన్న రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత, తండ్రి చంద్రబాబు నాయుడును భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేశ్‌ ములాఖత్‌ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అవినీతిని ప్రశ్నించినందుకే చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని అన్నారు.  పోలవరంపై మాట్లాడితే చంద్రబాబును రిమాండ్‌కు పంపారని, ప్రభుత్వ తప్పులు బయటపెట్టి ప్రజల తరఫున పోరాడితే దొంగ కేసు పెట్టారని విమర్శించారు. స్కిల్‌ కేసులో తొలుత రూ.3 వేల కోట్ల అవినీతి అన్నారని, ఆ తర్వాత రూ.300 కోట్లు అని ఆరోపించారు. ఇప్పుడే 27 కోట్లేనంటూ కొత్త రాగం అందుకున్నారని లోకేవ్ మండిపడ్డారు. కక్ష సాధింపుతోనే చంద్రబాబును రిమాండ్‌కు పంపారన్న ఆయన, వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబును రిమాండ్‌కు పంపారని తెలిపారు. 

కాంతితో క్రాంతి విజయవంతం చేయండిఇవాళ రాత్రి 7 గంటలకు కొవ్వొత్తులు, మొబైల్‌ ఫ్లాష్‌లైట్లతో సంఘీభావం తెలపాలని కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు నారా లోకేశ్. తమ కుటుంబం మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం రోడ్డుపైకి తెచ్చిందని, తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతిని, ఇతర పార్టీల ఫ్లోర్‌ లీడర్లను కలిసి చంద్రబాబు అరెస్టు గురించి వివరించినట్లు వెల్లడించారు. చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదని ఇతర పార్టీల నేతలు చెప్పారని, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తనకు భరోసా ఇచ్చారని లోకేశ్‌ తెలిపారు. కక్ష సాధింపు ధోరణితో పక్క రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వెళ్తున్నాయని విమర్శించారు. 

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు 10న సీఐడీ ముందుకు లోకేశ్రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ అక్రమాల కేసులో ఈనెల 10వ తేదీన సీఐడీ అధికారుల ఎదుట విచారణకు స్వయంగా హాజరు కావాలని మాజీ మంత్రి నారా లోకేశ్‌ను హైకోర్టు ఆదేశించింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 ఏ కింద నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరు కావాలని లోకేశ్‌కు స్పష్టం చేసింది. ఇదే కేసులో బెయిల్‌ కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇన్నర్‌ రింగు రోడ్డు అలైన్‌మెంట్‌ అక్రమాల కేసులో నారా లోకేశ్‌ను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించవచ్చని, మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం ఇవ్వాలని హైకోర్టు సూచించింది. విచారణ సమయంలో లోకేశ్‌ కనిపించేంత దూరం వరకు మాత్రమే న్యాయవాదిని అనుమతించాలని నిర్దేశించింది. విచారణకు వచ్చేటప్పుడు నిర్దిష్ట డాక్యుమెంట్లు తీసుకురావాలని లోకేష్‌ను ఒత్తిడి చేయబోమని సీఐడీ చెప్పిన విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.