ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని ప్రతిపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా రావని అధికార పార్టీ గట్టిగానే ప్రచారం చేస్తోంది. వై నాట్ 175 అంటు హోరెత్తిస్తోంది. అయితే ఈ లైన్ తప్పి కొందరు వైసీపీ లీడర్లు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. వారి మాట తీరు చూస్తే మాత్రం వైసీపీకి అలాంటి గడ్డు పరిస్థితి ఉందా అనేలా ఉంటున్నాయి.
మూడు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో ఉన్న నేతల్లో కూడా నైరాశ్యం ఆవరించిందా అనట్లు కొందరి నేతల కామెంట్స్ ఉన్నాయి. ఎన్నికలు ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ వైసీపీ కీలక నేతలకు భవిష్యత్ బెంగ పట్టుకున్నట్లు వారి మాట తీరులో కనిపిస్తోంది. ఇలాంటి కామెంట్స్ తరుచూ చేస్తున్న వారిలో మొదటి వరసులో ఉంటున్న నేత రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇప్పుడు ఆయన బాటలోనే మాజీ మంత్రి బాలినేని వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించండి
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే మన పరిస్థితి ఏంటని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే అంశంపై పార్టీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు, సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే మన పరిస్థితి ఏమిటి ? భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల తాట తీస్తామంటూ జనసేన, టీడీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని గుర్తు చేశారు. టీడీపీ నిజంగానే అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలని సూచించారు.
మంత్రి నుంచి తొలగించారనే బాధ ఉంది
మంత్రి పదవి నుంచి తొలగించారనే బాధ ఉందన్నారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అసంతృప్తులు, నాయకుల మధ్య విభేదాలుంటే పరిష్కరించుకుని, ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా గెలిపించుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 90 శాతం వాలంటీర్లు వైసీపీ మద్దతుదారులేనని ప్రకటించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల సమయంలో నేతలు వారిని కలుపుకొని వెళ్తే ప్రయోజనం ఉంటుందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాలంటీర్లను కచ్చితంగా మారుస్తామని హెచ్చరించారు. జగన్‌ను జైల్లో పెడితే న్యాయస్థానాన్ని గౌరవిస్తూ వైసీపీ కార్యకర్తలెవరూ రోడ్డెక్కలేదని, ఇప్పుడు చంద్రబాబును జైల్లో పెడితే న్యాయస్థానాన్ని తప్పుపట్టేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ అంటే ఎందుకంత మోజు-ధర్మాన
తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకంత మోజు అని మత్స్యకారులను ప్రశ్నించారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళం జిల్లాలోని పెద్దగనగళ్లవానిపేటలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ధర్మాన ప్రారంభించారు. మత్స్యకారుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించామన్న ధర్మాన, మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ అంటే మీకు ఎందుకంత మోజు ? అని ప్రశ్నించారు. విపక్షాల అసత్య ప్రచారాలను నమ్మొద్దని, ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పోయిందన్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకునే నాయకులు ఎవరు లేరని వ్యాఖ్యానించారు. పార్టీ అధినేత చంద్రబాబే అవినీతి కేసులో అరెస్టయ్యారని, మేలు చేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.