Kantareddy Tirupati Reddy Joins BRS:


ఓవైపు బీఆర్ఎస్ నుంచి నేతలు ఇతర పార్టీలకు వలస పోతుంటే, ప్రతిపక్ష పార్టీలో భంగపడిన నేతలు అధికార పార్టీకి క్యూ కట్టారు. ఇదివరకే మల్కాజిగిరి నుంచి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరడం తెలిసిందే. తాజాగా మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరుపతి రెడ్డి, ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి  వారిని పార్టీలోకి ఆహ్వానించారు.


డీసీసీ అధ్యక్షుడిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు
మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు తన కొడుకుకు మెదక్ జిల్లా టికెట్ అడగడంతో కాంగ్రెస్ పార్టీకి కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు. ఎందుకంటే తిరుపతి రెడ్డి మెదక్ నుంచే టికెట్ ఆశిస్తు్న్నారు. 


ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు వివేకానంద నగర్ లోని కంఠా రెడ్డి తిరుపతి రెడ్డి ఇంటికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంబిపూర్ రాజు, సునీత లక్ష్మారెడ్డి గురువారం (అక్టోబర్ 5న) వెళ్లారు. కంఠా తిరుపతి రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఆయన మంచి నాయకుడని హరీశ్ రావు కొనియాడారు. చాలా ఏళ్లుగా మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కృషి చేశారని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని హరీశ్‌ రావు ఆరోపించారు. పైసలకు పార్టీ టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. నమ్ముకున్న వారిని మోసగిస్తుందని అన్నారు. మైనంపల్లి చేరికతో కాంగ్రెస్ పార్టీలో రాజీనామాలు వరుసగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మేడ్చల్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.