కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. ఇదిగో విలీనం, అదిగో హడావుడి చేసినప్పటికీ, ఇప్పుడీ అంశంపై అటు వైఎస్సార్టీపీ నేతలు, ఇటు కాంగ్రెస్ నేతలు ఎవరు స్పందించడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 


119 సీట్లలో ఒంటరిగానే బరిలోకి
అటు 119 స్థానాలకు అభ్యర్థులను ఖ‌రారు చేసేందుకు కాంగ్రెస్‌ ముమ్మర కసరత్తు చేస్తోంది. దీంతో హస్తం పార్టీలో షర్మిల పార్టీ విలీనం లేనట్లేనని ప్రచారం జోరందుకుంది. విలీనంపై కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసం వేచి చూసిన షర్మిల, ఆ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. విలీనం లేకపోతే తెలంగాణలోని 119 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని షర్మిల గతంలోనే స్పష్టం చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి అన్ని నియోజవర్గాల్లోని ఆశావాహుల నుంచి వైఎస్సార్‌టీపీ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో వైఎస్సార్‌టీపీ వర్గాలు బిజీగా ఉన్నాయి.


షర్మిల రాకను వ్యతిరేకిస్తున్న సీనియర్లు
షర్మిల రాకను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. షర్మిల పార్టీలో చేరితే ఏపీ రాజకీయాల్లో  ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావించింది. అయితే ఏపీకి వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. తెలంగాణ నుంచే రాజకీయాలు చేసేందుకు షర్మిల ఆసక్తిగా చూపించారు. పలు అంశాల్లో షర్మిల, కాంగ్రెస్ అధిష్టానం మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పార్టీ విలీనానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. పార్టీ విలీనానికి సెప్టెంబర్ 30 వరకు కాంగ్రెస్‌కు షర్మిలకు డెడ్‌లైన్ విధించినా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. హస్తం పార్టీ పట్టించుకోకపోవడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్లాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 


చక్రం తిప్పిన రేవంత్ రెడ్డి
కాంగ్రెస్‌లోకి షర్మిల రాకను మొదటి నుంచి రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ షర్మిల కాంగ్రెస్‌లో చేరితే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న దానిపై హైకమాండ్‌కు నివేదికలు పంపించారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు షర్మిల గతంలో ప్రకటించారు. చక్రం తప్పిన రేవంత్ రెడ్డి, వ్యూహాత్మకంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చారు. పాలేరు నుంచి ఆయనకు టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు షర్మిలను తెలంగాణ కాంగ్రె్‌సలో చేర్చుకుంటే అదే పరిస్థితి పునరావృతమవుతుందని  నేతలు హైకమాండ్ కు స్పష్టం చేశారు. 


డీకే శివకుమార్ సంప్రదింపులు
స్థానిక నేతలు పార్టీ విలీనానికి  అడ్డుపడటంతో షర్మిల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపారు. ఇటీవల హైదరాబాద్‌లో డీకే శివకుమార్‌తో జరిగిన భేటీలో విలీనంపై చర్చించారు. అంతకుముందు ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీని కలిశారు. దీంతో వైఎస్సార్‌టీపీ విలీనం ఖాయమంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఎలాంటి ముందడుగు పడలేదు. డెడ్ లైన్ విధించినా విలీనం అంశంపై హస్తం పార్టీ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని షర్మిల నిర్ణయించుకున్నారు.