టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును జూనియర్ ఎన్టీఆర్ ఖండించకపోవడంపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ వారికి వంద రకాల సమస్యలు ఉంటాయన్న ఆయన, 24 విభాగాల్లో పని చేసే వారికి బాధలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయన్నారు. ఒకవేళ ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే వైసీపీ నేతలు టార్గెట్ చేస్తారని, వారి నోళ్లలో ఎందుకు పడాలని అనుకుంటున్నారని చెప్పారు.


సినిమా రంగంలో స్వేచ్ఛ ఉంది
 2009లో ప్రజారాజ్యం పెట్టినపుడు, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు కూడా సినిమా రంగంలో గ్రూపులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు సూపర్ స్టార్ కృష్ణ, ప్రభాకర్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పై ఎన్నో సినిమాలు తీసినా ఆయన ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగలేదన్నారు. తనకు వ్యతిరేకంగా సినిమాలు తీసిన వారితో కూడా కలిసి నటించారని పవన్ కల్యాణ్ అన్నారు. రజినీకాంత్ లాంటి గొప్ప  నటుడ్ని తిట్టని తిట్టు లేదన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజినీకాంత్ ను వైసీపీ నేతలు వదిలి పెట్టలేదని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేతల నోళ్లలో ఎవరు పడాలని భావించారని అన్నారు. 


గతంలోనూ టాలీవుడ్ హీరోలపై ప్రశంసలు
గతంలోనూ పవన్ కల్యాణ్ టాలీవుడ్ హీరోలపై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్, చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్లని, తన కంటే పెద్ద స్టార్లు అయ్యారన్న ఇగో తనకు ఉండదన్నారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ అంటే  గౌరవం, ఇష్టం ఉందన్నారు. వాళ్ల సినిమాలు చూస్తానన్న ఆయన, కనిపిస్తే మాట్లాడుకుంటామన్నారు. సినిమాల పరంగా మీకు హీరోల మీదున్న ఇష్టాన్ని రాజకీయంగా చూపించవద్దని, ఎందుకంటే రాజకీయాలు వేరని గుర్తు చేశారు. సినిమాలు ఇష్టపడితే మహేష్, జూనియర్ ఎన్టీఆర్, ఇలా ఎవరినైనా ఇష్టపడండి, రాజకీయం దగ్గరికి వచ్చేసరికి నా మాట వినాలని సూచించారు. మహేష్, ప్రభాష్ తన కంటే పెద్ద హీరోలన్న పవన్, పాన్ ఇండియా హీరోలు కాబట్టి తన కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారని గుర్తు చేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయారని, వాళ్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుసని, అయితే తాను మాత్రం తెలియదన్నారు. అయినప్పటికీ తనకు ఎలాంటి ఇగోస్ లేవని, సగటు మనిషి బాగుండాలన్నదే తన అభిమతమని గుర్తు చేశారు. 


ప్రస్తుతం మూడు సినిమాలు
ప్రస్తుతం పవన్ కల్యాన్ మూడు సినిమాల్లో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, అలాగే సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘OG’ సెట్స్‌పై ఉన్నాయి. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు పవన్ కల్యాన్. టీడీపీ అనుభవం, జనసేన పోరాటతత్వం కలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సులువు అవుతుందని అన్నారు.