AP Janasena :   జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా గందరగోళానికి దారి తీస్తున్నాయి. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మరీ  టీడీపీకి మద్దతు ఇచ్చానని ఆయన ప్రకటించడంతో జాతీయ మీడియా కూడా ఎన్డీఏ నుంచి మరో పార్టీ బయటకు వెళ్లిపోయిందని ప్రచారం చేసింది. అయితేే పవన్ కల్యాణ్ తర్వాతి రోజే ఖండించారు. తాను ఎన్డీఏలోనే ఉన్నానని.. తాను బయటకు వెళ్తే అందరికీ చెబుతానన్నారు. బీజేపీ తమతో కలిసి వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. బీజేపీతో కలిసే ఉన్నానని అంతిమంగా ఆయన చెబుతున్నారు. కానీ టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు. అక్కడే క్లారిటీ మిస్ అవుతోంది. 


టీడీపీతో కలిసి పోటీ చేయడం ఖాయం - మరి బీజేపీ ప్రస్తావన ఎందుకు ?              


పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి పోటీ చేస్తే ఓట్లు వస్తాయి కానీ సీట్లు రావని అన్నారు. టీడీపీతో కలిసి పోటీ చేస్తే తిరుగు ఉండదని నమ్ముతున్నారు. అదే విషయాన్ని చెబుతున్నారు. టీడీపీతో పోటీ చేయడం ఖాయమని.. సమన్వయ కమిటీని కూడా నియమించుకుంటున్నామన్నారు. బీజేపీతో ఎలాంటి అంశాలు చర్చించకుండా చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత పొత్తు విషయం ప్రకటించారు. దీంతో  బీజేపీతో జనసేన మైత్రి ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. అయితే బీజేపీ కూడా కలిసి వస్తుందని నమ్ముతున్నానని ఆయన పదే పదే చెబుతున్నారు .  అసలు బీజేపీ ప్రస్తావన తీసుకు రావాల్సిన అవసరం ఏమిటన్నది మాత్రం రాజకీయవర్గాలకు అంతు చిక్కకుండా ఉంది. 


ఏపీ గురించి పట్టించుకునే తీరిక లేని బీజేపీ హైకమాండ్               


అయితే ఏపీ రాజకీయాలపై బీజేపీ హైకమాండ్ పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. ఇటీవలి కాలంలో ఒక్క అగ్రనేత కూడా ఏపీలో పర్యటించలేదు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఏపీలో అమిత్ షాతో పాటు జేపీ నడ్డా చెరో సభను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్‌సీపీని విమర్శించారు.  అదే రాజకీయం. జనసేనతో కలిసి ఉన్నారో లేదో వారు చెప్పలేదు. జనసేనను పిలవలేదు. మళ్లీ ఏపీ గురించి పట్టించుకోలేదు. ఎన్డీఏ మీటింగ్ కు పవన్ ను ఆహ్వానించారు. ఆయన వెళ్లి వచ్చారు. తాను చెప్పాలనుకున్నది చెప్పానని ఆయన అంటున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ ఇక్కడ రాష్ట్ర నేతలకూ సమాచారం ఇవ్వకపోవడంతో ఎలాంటి విధానాన్ని పాటించాలో చెప్పకపోవడంతో.. వారికీ స్పష్టత లేదు. పొత్తులపై కేంద్ర పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వెళ్తామని.. చెబుతున్నారు. కానీ అక్కడ్నుంచి ఏ ఆదేశాలు రావడం లేదు. 


బీజేపీని పవన్ ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు ?                 


ఏపీలో బీజేపీకి కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ ..  బీజేపీకి ఎంత మేర కావాలో అంత మేర సపోర్టుగా ఉంటోంది. ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టడం లేదు. కావాల్సినప్పుడల్లా సహకరిస్తోంది. ఇంతగా సహకరిస్తున్న పార్టీని దూరం చేసుకోవడం ఎందుకన్న అభిప్రాయంతో ఆ పార్టీ అగ్రనేతలు ఉన్నారన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో  వైసీపీ సహకరించినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా పొత్తులు పెట్టుకోదు. అదే మైనస్. బీజేపీ .. 2014 నాటి పొత్తులతో పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుంది.  కానీ అలా చేయాలంటే... ముందు వైసీపీకి దూరమన్న భావన కల్పించాలి. అదే ఇప్పుడు బీజేపీకి పెద్ద చిక్కుగా మారింది.