Thummala Nageswara Rao about Rythu Bharosa Scheme: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీని అమలు చేస్తోంది. సచివాలయంలో రైతు రుణమాఫీ అంశంపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. చెప్పిన సమయానికే రైతులకు రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నారు. అయితే రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వడం కష్టమే అన్నారు. దీనిపై మొదటగా రైతులతో మాట్లాడి వివరాలు సేకరిస్తామని, అందుకే రైతు భరోసాకు మరింత టైమ్ పడుతుందని స్పష్టం చేశారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హామీల్లో ప్రకటించినట్లుగా రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. తొలి విడతగా రూ.1 లక్ష వరకు రుణాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఆపై రూ.1.5 లక్షల వరకు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. రాష్ట్ర రైతులకు ఆగస్టు 15లోపు రూ2 లక్షల రుణమాఫీని పూర్తిచేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆగస్టు 14న రుణమాఫీ హామీని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తొలి విడతగా దాదాపు 11.50 లక్షల మంది రైతులకు రూ.6 వేల కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది. రెండో విడతలో రూ.1.5 లక్షల రుణాలను 6.40 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6190 కోట్లు అసెంబ్లీ వేదికగా విడుదల చేశారు.


బీఆర్ఎస్ రుణమాఫీతో ఏ ప్రయోజనం లేదు


ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేవలం రూ.25 వేల చొప్పున రైతుల ఖాతాల్లో రుణమాపీ నగదు జమచేసేది. ఏడాదికి కొంత మొత్తం చొప్పున రుణమాఫీ చేశారు. కానీ ఆ రుణ మాఫీతో రైతులకు ఏ ప్రయోజనం లేకపోయింది. దేశంలో ఇప్పటివరకూ ఏ రాష్ట్రం ఈ స్థాయిలో రైతులకు రుణ మాఫీ చేయలేదు. ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వం (కాంగ్రెస్ పార్టీ)కే దక్కనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నిండా ముంచింది. కానీ మేం ఎన్నికల హామీల్లో భాగంగా రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తున్నాం. ఎవరికైనా ఆరోజు రుణమాఫీ అవకపోతే, వారి వివరాలు సంబంధిత అధికారులకు సమర్పించాలి. బ్యాంకు ఖాతాల్లో జమ కాని వారు, టెక్నికల్ ఇబ్బందులు ఎదురైనా వారికి సాధ్యమైనంత త్వరగా సమస్య క్లియర్ చేస్తాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగ రైతుల విషయంలో మేం రాజకీయాలు చేయడం లేదు. బీఆర్ఎస్ నేతలు మాత్రం రైతు రుణమాఫీపై సైతం పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారు. 


టెక్నికల్ సమస్యలు పరిష్కరిస్తాం.. 
గత ప్రభుత్వం హైదారబాద్ ఓఆర్ఆర్‌ పనులను తమకు అనుకూలంగా ఉన్న సంస్థకు రూ.7 వేల కోట్లకు అప్పనంగా కట్టబెట్టిందని, ఆ డబ్బుతోనే ఎన్నికల ముందు రుణమాఫీ అంటూ రూ.1 లక్ష జమ చేశారని తుమ్మల చెప్పారు. రూ.1,400 కోట్లు ఇంకా రైతుల ఖాతాల్లో జమకాలేదని, వెరిఫై చేస్తుంటే తిరిగి నగదును బ్యాంకులు ప్రభుత్వానికి పంపాయన్నారు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న రుణమాఫీలో సాంకేతిక ఇబ్బందులతోనే 30 వేల మంది ఖాతాల్లో నగదు జమ కాలేదన్నారు. అయితే వీటిని త్వరలోనే పరిష్కరించి అందరు రైతులకు రుణాలు మాఫీ చేసి హామీ నిలబెట్టుకుంటామని తుమ్మల స్పష్టం చేశారు.


Also Read: కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ - జైల్లోనే ఉండాలనుకుంటున్నారా ?