Anantapur YSRCP : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తనకంటూ ఒక ఇమేజ్ ని సెట్ చేసుకున్నారు. నియోజకవర్గంలోనూ బలమైన క్యాడర్ ఉంది. అలాంటి నేత గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశాడు. ఓటమి అనంతరం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మాజీ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా .. కూటమికి అనుకూలంగా ఆ మాటలు ఉండటమే కారణం.
గుడ్ మార్నింగ్ ధర్మవరం తో న్యూ ఇమేజ్ :
ఒక్క సారి ఆ పురాణాలు ధాటొచ్చి చూడు అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు, విలన్లు లేరు ఈ నాటకంలో అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇటీవలి కాలంలో వేదాంతం వల్లిస్తున్నారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమంతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోని సోషల్ మీడియాలో కూడా ఆయన ట్రెండింగ్ పొలిటీషియన్. ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు.. కేతిరెడ్డి. తండ్రి హత్యతో చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. కానీ వచ్చిన కొన్ని రోజులకే ఆయన తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు.
బీజేపీ చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కేతిరెడ్డి
ఇప్పటి వరకు కేతిరెడ్డి నాలుగు ఎన్నికలు చూశారు. ఇందులో రెండు సార్లు గెలిస్తే.. రెండు సార్లు ఓటమి ఎదురైంది. వాస్తవంగా ఇంత జర్నీ చేసిన వారికి ఎవరికైనా గెలుపొటములను ఈజీగా తీసుకుంటారు. కానీ కేతిరెడ్డి మాత్రం తాజాగా ఎదురైన ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ధర్మవరంలో అసలు బీజేపీ అనే పార్టీనే లేదు. బాగా లెక్క పెట్టినా 20మంది నేతలు కూడా ఉండరు. ఇక ఓట్ బ్యాంక్ అంటారా.. ఒకటి లేదా 2శాతం మాత్రమే ఉంటుంది. ఒక్కోసారి నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయి. అలాంటి చోట ఒక బీజేపీ అభ్యర్థి ధర్మవరంలో అసలు ఎవరో తెలియని సత్యకుమార్ లాంటి వ్యక్తి పోటీ చేసి కేతిరెడ్డిపై గెలుపొందారు. ఇక్కడ బీజేపీ గెలుపుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా టీడీపీ, పరిటాల శ్రీరామ్ ఉన్నప్పటికీ కమలం గుర్తు.. అసలు ఎవరో తెలియని వ్యక్తి చేతిలో ఓడిపోవడమే కేతిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఓటమి తరువాత వరుసగా ఆయన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన ఆవేదనను పంచుకుంటున్నారు. మొదటి రెండు వీడియోల్లో ఎక్కువగా తన వ్యక్తిగత ఓటమికి కారణాల గురించి చెప్పారు. ఆ తర్వాతి నుంచి కేతిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
అధినేత జగన్ పై కీలక వ్యాఖ్యలు :
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చేసిన విధానాలు అధినేత జగన్ తీసుకున్న నిర్ణయాల మీద కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇందులో తమ పార్టీ అనో లేక జగన్ తమ అధినేత అనో కేతిరెడ్డి ఎక్కడా కేర్ చేయడం లేదు. సరిగ్గా మేము ఇదే తప్పు చేశాం.. జగన్ కు తెలియకుండా తెర వెనుక సజ్జల, ధనుంజయ రెడ్డి లాంటి వారి వ్యవహార తీరు గురించి సూటిగానే చెబుతున్నారు. ఇప్పుడు కేతిరెడ్డి తాజాగా విడుదల చేసిన వీడియో ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెంచింది. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. వాస్తవంగా కేతిరెడ్డి మాట్లాడింది ఒకటైతే.. జనం, మీడియా అర్థం చేసుకున్నది ఇంకొకటి అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కేతిరెడ్డి జగన్ని విమర్శించారని కొందరు.. లేదు చంద్రబాబును టార్గెట్ చేశారని మరికొందరు.. ఇంకొందరు జనాన్నే టార్గెట్ చేశారని ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు చర్చించుకుంటున్నారు.
ఆ వీడియోలో ఏం మాట్లాడారు :
తాజాగా వీడియోలో కేతిరెడ్డి ఏం మాట్లాడారు అంటే.. జనం ఎప్పుడూ అద్భుతాలు కోరుకోరని.. మార్పు చేస్తామంటే ఒప్పుకోరని.. సమాజం ఎలా ఉందో అలానే మనం నడవాలని.. లేకపోతే ఇలానే దెబ్బపడుతుందని అంటున్నారు. ఆ మాటలకు అర్థం ఏంటంటే.. జగన్ రెడ్డి విద్య, వైద్యంలో నాడు నేడు పేరుతో మార్పులు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో భూసమస్యలకు పరిష్కారం, పరిసరాల పరిశుభ్రత కోసం చెత్తపై పన్ను వేయడం ఇంకా ఇలా చాలానే చేసి ఏదో మారుద్దాం అనుకున్నారు కానీ.. ప్రజలు అంత మార్పును అంగీకరించరని అంటున్నారు. పైగా మనిషి ఆషా వాదీ మనం ఎంత ఇచ్చినా.. పక్క వాడు ఇంకా ఎక్కువ ఇస్తాడంటే... వారి వైపు వెళ్తారు.. ఇందులో నిజమెంత అన్నది వారు చూడరన్నారు.
సినిమా వాళ్ళతో మనకెందుకు అన్నా :
సినిమా వాళ్ల విషయంలో ఏం జరిగిందన్నది కూడా క్లారిటీ ఇచ్చారు. సినిమా టికెట్లు భారీ రేట్లు పెట్టడం వలన జనం పై భారం పడుతోందని.. అందుకే టికెట్లు అందురూ కొనే విధంగా ఉండాలని టికెట్ల రేట్లు తగ్గించి.. సినిమా వాళ్లకు జగన్ చెడ్డ అయ్యారన్నారు. దీని వలన జగన్ కు వచ్చిన లాభం ఏంటి అంటున్నారు. అలాగే నా బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్నారు.. అందుకే మిగిలిన వారు దూరమయ్యారని.. పోనీ ఆ వర్గాలు నీతోనే ఉన్నాయా అదీ లేదని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో అసలు కేతిరెడ్డి టార్గెట్ ఎవరన్నది అర్థంకాని పరిస్థితి.