Telangana Cabinet : తెలంగాణ మంత్రివర్గ సమావేశం పదకొండో తేదీన జరగనుంది. ప్రగతి భవన్‌లో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత కేబినెట్ భేటీ జరుగుతోంది. ఉపఎన్నికలు ఖాయం కావడంతో ఎలాంటి వ్యూహం అవలంభించాలన్నదానిపై చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉంది. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేకపోతున్నారు. అప్పులపై కేంద్రం కఠినమైన పరిమితి విధించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ వనరుసపై కేబినెట్ చర్చించనుంది.
తెలంగాణ అప్పులపై కేంద్రం పరిమితి
తెలంగాణ సర్కార్ ఈ ఏడాది దాదాపు రూ.54వేల కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్లో ప్రభుత్వం భావించినప్పటికీ.. కేంద్రం ఆ మేరకు అనుమతి ఇవ్వలేదు రూ.35వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇవి కాకుండా గ్యారంటీల పేరుతో తీసుకునే అప్పులు కూడా పరిమితుల మేరకే లభించనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.47,500 కోట్ల అప్పు తీసుకుంది. గ్యారంటీ అప్పులను ఇష్టమొచ్చినట్లు తెచ్చుకునే వీల్లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అందులో భాగంగానే గ్యారంటీ అప్పులపై అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ ఇటీవల లెటర్ కూడా రాసింది. దీంతో రాష్ట్ర సర్కార్ గ్యారంటీ అప్పులపై కూడా ఆశలు వదులుకుంది.
బీజేపీలోకి సినీ నటి జయసుధ, జోరుగా ప్రచారం!
గతంలో ఎక్కువ తీసుకోవడంతో ఈ ఏడాది పరిమితి
పోయిన ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్ర సర్కార్ గ్యారంటీల పేరుతో తెచ్చే అప్పులను లెక్కలో చూపట్లేదు. ఇదంతా ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా జాగ్రత్త పడుతోంది. ఆ అప్పుల కిస్తీలు మాత్రం బడ్జెట్లో నుంచి కడుతూ వస్తోంది. ఇప్పుడు ఇలా కట్టినవన్నీ ఎఫ్ఆర్బీఎం (ఆర్బీఐ) అప్పుల కింద లెక్కిస్తామని చెప్పింది. ఇదిలా ఉంటే 2023 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు మొత్తం రూ.3.44 లక్షల కోట్లకు చేరుతుందని మార్చిలో పెట్టిన బడ్జెట్లోనే ప్రభుత్వం వెల్లడించింది. కానీ బడ్జెట్తో సంబంధం లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిట ఇప్పటికే తెచ్చిన రుణాలు రూ.1,35,282 కోట్లు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం ష్యూరిటీపై తెచ్చింది. మొత్తంగా ప్రభుత్వం తెచ్చిన అప్పుల మొత్తం రూ.4.50 లక్షల కోట్లు దాటుతోంది. అందుకే కేంద్రం అప్పుల విషయంలో పరిమితి విధించింది.
నాడు ఉపఎన్నికలే బ్రహ్మాస్త్రం - నేడు వాటితోనే గండం ! టీఆర్ఎస్‌కు టెన్షన్ !
మునుగోడు ఉపఎన్నికపై చర్చించే అవకాశం
వీటన్నింటినీ చర్చించడంతో పాటు రాజకీయ పరిణామాలపైనా కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. మునుగోడు ఉపఎన్నికను ఎలా ఎదుర్కోవాలన్నది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ఉపఎన్నికల రచ్చ ఎందుకు.. ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.