Jayasudha Joins Bjp :  ప్రముఖ సినీనటి జయసుధ బీజేపీలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్దిరోజులుగా ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. బీజేపీలో చేరడంపై తెలంగాణకు చెందిన కొంతమంది నేతలు ఆమెతో చర్చించినట్లు సమాచారం. ఈనెల 21న మునుగోడులో జరిగే బీజేపీ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమక్షంలో జయసుధ ఆ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై స్పందించిన జయసుధ.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ఈ నెల 21న బీజేపీలో చేరడం లేదన్నారు. బీజేపీ నేతల ముందు ఆమె కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. తన ప్రతిపాదనలు అంగీకరిస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధమని జయసుధ చెప్పినట్లు సమాచారం. బీజేపీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి హామీ ఇస్తేనే పార్టీలో చేరుతానని చెప్తానని జయసుధ చెప్పినట్లు తెలుస్తోంది. 


సినీ నటులను ఆహ్వానిస్తోన్న బీజేపీ 


ఇంతకు ముందు కాంగ్రెస్‌లో కొనసాగిన జయసుధ 2009లో సికింద్రాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైఎస్ఆర్ టైంలో కాంగ్రెస్ పార్టీలో జయసుధ కీలకంగా వ్యవహరించారు. తాజాగా జయసుధను బీజేపీ చేరికల కమిటీ ఆ పార్టీలోకి ఆహ్వానించింది. సినీ గ్లామర్ అనేది పార్టీకి కలిసొస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటులను బీజేపీలోకి ఆహ్వానిస్తోంది. తెలంగాణలో విజయశాంతి, తమిళనాడులో కుష్బూ ఇలా ప్రతి రాష్ట్రంలోనూ సినీ ప్రముఖులను తమ పార్టీలో జాయిన్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే సినీనటి జయసుధతో చర్చలు జరుపుతోంది.


సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా విజయం 


కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన జయసుధకు 2009 ఎన్నికలలో సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా సీటు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణం అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఇన్ యాక్టివ్ అయ్యారు. ఆ తర్వాత 2016లో టీడీపీలో చేరిన జయసుధ.. ఆ తరువాత టీడీపీకి గుడ్ బై చెప్పారు. తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయుడు పెట్టిన పార్టీ కాబట్టి వైసీపీలో చేరారని అప్పట్లో ఆమె చెప్పారు. అయితే వైసీపీలో సైలెంట్ అయిన ఆమె ఇప్పుడు బీజేపీ ఇచ్చిన ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.  


బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ 


తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దాసోజు శ్రవణ్ కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా వివిధ పార్టీల నేతలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. తాజాగా జయసుధ కూడా బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ విషయంగా బీజేపీ నేతలు లీక్ లు ఇస్తున్నారు. జయసుధతో చర్చిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ తో సహా ఇతర పార్టీల నేతలు టచ్ లో ఉన్నారన్నారు. త్వరలో ఆ నేతలంతా బీజేపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. 


Also Read : Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే


Also Read : Gutha Sukender Reddy: కుటుంబ పాలనపై రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం - గుత్తా సుఖేందర్ రెడ్డి