By election Tension for TRS : రాజకీయం అంటే రోలర్ కోస్టర్ లాంటిదే. ఒక్క సారిగా పైకి వెళ్లిపోతారు. అంతే వేగంగా కిందకు పడిపోతారు. అయితే అలా పైకి వెళ్లడానికి.. కిందకు రావడానికి ఒక్కో సారి ఒకే కారణం కీలకంగా పని చేస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి విషయంలో ఇప్పుడు అదే రోలర్ కోస్టర్ రైడ్ సీరిస్ కనిపిస్తోంది. ఉపఎన్నికలంటే ఇప్పుడు ఆ పార్టీకి టెన్షన్ పుడుతోంది. కానీ ఒకప్పుడు ఈ ఉపఎన్నికలతోనే టీఆర్ఎస్ నిలబడింది.
టీఆర్ఎస్‌కు నాడు ఉపఎన్నిలు ప్లస్ - నేడు మైనస్ !
తెలంగాణ రాష్ట్ర సమితిని ఉపఎన్నికలను ప్రత్యేకంగా చూడలేం. ఎందుకంటే టీఆర్ఎస్ రాజకీయ వ్యూహంలో రాజీనామాలు.. ఉపఎన్నికలు ప్రముఖ స్థానంలో ఉంటాయి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నీరుగారిపోతుందని అనుకున్నప్పుడల్లా రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లేవారు. మరింత భారీ మెజార్టీతో గెలిచి ఉద్యమానికి ఊపు తెచ్చేవారు. ఇలాంటి ఉపఎన్నికల్తో టీఆర్ఎస్ ఉద్యమాన్ని ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. అదే సమయంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్‌కు ఉపఎన్నికలు ఓ కేక్ వాక్. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు మరణించిన స్థానాల్లోనూ పోటీ చేసి.. భారీ మెజార్టీలతో గెలిచింది. అయితే ఇప్పుడుపరిస్థితి మారిపోయింది. గత రెండేళ్ల నుంచి ఉపఎన్నికలంటే టీఆర్ఎస్‌కు కలసి రావడంలేదు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోవడంతో జరిగిన ఉపఎన్నికల్లో చివరికి సానుభూతి కూడా పని చేయలేదు. అక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కే వరుసగా ఓడిపోతున్న సానుభూతి లభించింది. ఇక కోరి తెచ్చుకున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో సర్వశక్తులు ఒడ్డినా ప్రయోజనం లేకపోయింది. నాగార్జునసాగర్‌లో గెలిచినా పెద్దగా ప్లస్ కాలేదు.
కోరుకోకుండా వస్తున్న ఉపఎన్నిక - టీఆర్ఎస్ టెన్షన్ !
'
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకూ పలు సందర్భాల్లో ఉపఎన్నికలను ఉద్దేశపూర్వకంగా తెచ్చేవారు. హుజూరాబాద్ ఉపఎన్నికను ఆయన కోరుకున్నారు. అందుకే వేగంగా ఈటలపై చర్యలు తీసుకుని ఆయన పార్టీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేలా చేయగలిగారు. అయితే ఆ ఉపఎన్నికలో ఎదురుదెబ్బ తగిలిగింది. ఇప్పుడు మనుగోడు ఉపఎన్నికను బారతీయ జనతా పార్టీ తమ వ్యూహంలో భాగంగా తీసుకొచ్చింది. ఇది టీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతోంది . రాజీనామా ఆమోదించకుండా పెండింగ్‌లో పెడితే.. టీఆర్ఎస్ భయపడుతోందన్న ప్రచారం జరుగుతుంది. అది మొదటికే మోసం తెస్తుంది. అందుకే తక్షణం ఆమోదించేసి.. చావో రేవో తేల్చుకుందామని డిసైడయ్యారని భావిస్తున్నారు. అయితే మునుగోడు ఉపఎన్నిక మాత్రం టీఆర్ఎస్ కోరుకోలేదని సుస్పష్టం.
ఆర్ ఫ్యాక్టర్‌తోనూ టీఆర్ఎస్‌కు ఫికరే !
రాజకీయాల్లో సెంటిమెంట్లకూ కొదవ ఉండదు. కావాలని కాకపోయినా బీజేపీకి "ఆర్ ఫ్యాక్టర్" బాగా వర్కవుట్ అవుతోంది. అదే టీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతోంది. బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లూ ఆర్‌తో ప్రారంభమవుతాయి. మందస్తు అసెంబ్లీఎన్నికల్లో బీజేపీ తరపున ఒక్క రాజాసింగ్ మాత్రమే గెలిచారు . తర్వాత ఉపన్నికల్లో రఘునందన్ రావు, రాజేందర్ గెలిచారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రేసులో ఉన్నారు. అసెంబ్లీలో త్రిబుల్ ఆర్ ఉన్నారని ...త్వరలో మరో నాలుగో ఆర్ వస్తారని బండి సంజయ్ గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ ఉపఎన్నిక రానే వస్తోంది.
రాజకీయాలంటే అంతే..ఒకప్పుడు ప్లస్ అయినవే..నేడు మైనస్ అవుతాయి. ఉపఎన్నికలతో ఉద్యమాన్ని ఉధృతం చేసి రాజకీయంగా పట్టు సాధించిన టీఆర్ఎస్.. ఇప్పుడు ఇతర పార్టీలు వేస్తున్న ఉపఎన్నికల వ్యూహంలో చిక్కుకుని ... పోరాడుతోంది.