Teacher Helped Students In Floods In Asifabad District: టీచర్.. విద్యార్థుల భవితకు మార్గనిర్దేశం చేసే ఓ గొప్ప వ్యక్తి. కేవలం పుస్తకాల్లో పాఠాలు మాత్రమే కాదు జీవిత పాఠాలు కూడా నేర్పుతారు. అవసరమైతే మన చేయి పట్టుకుని గమ్యాన్ని చేరేలా చేస్తారు. కుమురం భీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడు అలాంటి కోవకే చెందుతారు. వాగులో వరద ఉద్ధృతిని దాటలేని క్లిష్ట సమయంలో విద్యార్థులను తన భుజాన వేసుకుని వాగును దాటించి అండగా నిలిచారు. ఉపాధ్యాయుని సేవలను గ్రామస్థులతో పాటు అంతా ప్రశంసించారు. ఇదే మరో చోట ఓ లేడీ టీచర్ విద్యార్థుల పట్ల తన కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఖమ్మం (Khammam) జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులు జుట్టు పెంచి తరగతులకు హాజరవుతున్నారని.. మాట వినడం లేదని కత్తెరతో వారి జుట్టును కత్తిరించారు. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై ఓ టీచర్ అంతులేని అభిమానం.. మరో చోట విద్యార్థులపై లేడీ టీచర్ కాఠిన్యాన్ని మనం చూడొచ్చు. 


విద్యార్థులను భుజాలకెత్తుకొని


కుమురం భీంఆసిఫాబాద్ జిల్లాలో పెంచికల్పేట గ్రామంలోని జైహింద్‌పూర్‌లోని పాఠశాలకు ఈ నెల 25న (గురువారం) ఉదయం విద్యార్థులు చిన్న వాగు దాటి వచ్చారు. అప్పటికే వర్షాలు కురుస్తుండగా.. ఎగువన కురిసిన భారీ వర్షాలతో సాయంత్రానికి విద్యార్థులు ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో వాగు ఉద్ధృతంగా మారింది. దీంతో ఆందోళన చెందిన విద్యార్థులు ఉపాధ్యాయుడు సంతోష్‌కు విషయం చెప్పగా.. ఆయన విద్యార్థులను తన భుజానికి ఎక్కించుకుని.. నడుం లోతు నీటిలో వారిని జాగ్రత్తగా వాగు దాటించాడు. ఇలా 10 మంది విద్యార్థులను సురక్షితంగా వరద దాటించగా.. గ్రామస్థులు సైతం ఆయనకు సహాయం అందించి మిగిలిన విద్యార్థులను వరద దాటించారు. ఉపాధ్యాయుడు చేసిన పనిని గ్రామస్థులు అభినందించారు. సాహసంతో విద్యార్థులను వాగు దాటించిన సంతోష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


లేడీ టీచర్ కాఠిన్యం


అటు, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థుల పట్ల కఠినత్వం ప్రదర్శించారు. కొందరు విద్యార్థులు రోజూ జుట్టు పెంచుకుని తరగతులకు హాజరవుతున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కటింగ్ చేయించుకుని స్కూలుకు రావాలని చెప్పినా విద్యార్థులు వినడం లేదని భావించిన సదరు టీచర్.. కత్తెరతో 8 మంది విద్యార్థులు జుట్టు కత్తిరించారు. ఈ క్రమంలో విద్యార్థుల తలపై అక్కడక్కడ ఎలుకలు కొరికినట్లుగా మారింది. ఈ విషయాన్ని విద్యార్థులు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా.. వారు ఆగ్రహంతో పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు. టీచర్ చేసిన పనికి తమ పిల్లలకు గుండు కొట్టించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సదరు లేడీ టీచర్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Also Read: Adilabad News: చేపలే చేపలు - పండుగ చేసుకుంటోన్న గ్రామస్థులు, ఆ ప్రాజెక్టు వద్ద జల'కళ'తో పాటు 'జన'కళ