People Catching Fish In Kartwad Project In Adilabad: ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అటు కొన్ని ప్రాంతాల్లో రహదారిపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే, ఆ గ్రామాల ప్రజలు మాత్రం జలపాతం వద్ద చేపలు పడుతూ పండుగ చేసుకున్నారు. చీరలు, దోతులు, వలల్లో భారీగా చేపలు చిక్కడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ (Boath) మండలం కరత్వాడ ప్రాజెక్ట్ (Karatwad Project) వద్ద శనివారం జలకళతో పాటుగా జన'కళ' సంతరించుకుంది. కరత్వాడ ప్రాజెక్ట్ వారం రోజులుగా కురుస్తోన్న వర్షాలతో నిండిపోయింది. దీంతో ప్రాజెక్టు అలుగుపై నుంచి వరద పారుతోంది. వరద నీటితో పాటు ప్రాజెక్టులోని చేపలు సైతం అలుగు దాటి కొట్టుకు పోతున్నాయి.


గ్రామస్థుల క్యూ


ఈ క్రమంలో కరత్వాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రాజెక్ట్ వద్దకు క్యూ కట్టారు. దాదాపు 10 నుంచి 20 కిలోల బరువున్న చేపలు వరద నీటిలో కొట్టుకువస్తుండడంతో వాటిని పట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. వలలు, దోమ తెరలు, చీరలు, దోతులు పట్టుకొని చేపలు పడుతున్నారు. వివిధ గ్రామాల జాలర్లు చేపలను పట్టుకొని వాహనాల్లో మార్కెట్లకు సైతం తరలించారు. కొంత మంది జాలర్లు అక్కడే ప్రజలకు విక్రయించారు. తాజా చేపలు దొరకడంతో ప్రజలు భారీగా వచ్చి కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.



మత్స్యకారుల ఆవేదన


అయితే, చేపలన్నీ వరద నీటిలో కొట్టుకుపోతుండడంతో స్థానిక మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. 5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్న క్రమంలో ప్రాజెక్టులోని మత్స్యసంపద అంతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అటు, స్థానిక ప్రజలు మాత్రం తమ చేతికి చిక్కిన చేపలతో పండుగ చేసుకుంటున్నారు. 


Also Read: Badrachalam: గోదావరికి వరద ఉద్ధృతి - భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ