Donkeys Eating Gulab Jamuns: వర్షాలు కురవడం కోసం ఒక్కొక్కరూ ఒక్కో విధంగా దేవుడిని ప్రార్థిస్తుంటారు. వర్షం పడితే ఆ వరుణుడికి కృతజ్ఞతలు చెబుతారు. మధ్యప్రదేశ్‌లో మంద్‌సౌర్‌ ప్రజలు ఇలాగే చేశారు. కానీ..వీళ్లు చేసిన పని సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఈ ఏడాది బాగా వానలు కురుస్తున్నాయి. ఆ సంతోషంలో అక్కడి వాళ్లంతా గాడిదలకు గులాబ్ జామూన్‌లు తినిపించారు. ప్రత్యేకంగా వాటి కోసం తయారు చేయించి మరీ తినిపించారు. ఆ సమయంలో అవి అటూ ఇటూ  పారిపోకుండా గట్టిగా పట్టుకున్నారు. పెద్ద స్టీల్‌ ప్లేట్‌లో గులాబ్ జామూన్‌లు నింపి వాటి ముందు పెట్టారు. వర్షాలు బాగా పడితే గాడిదలకు ఇలా మిఠాయిలు పెట్టడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయమట. చుట్టు పక్కల ఉన్న గాడిదలన్నింటినీ తీసుకొచ్చి ఇలా పండగ చేసుకుంటున్నారు ప్రజలు. 






గతేడాది కూడా ఇలానే ఇక్కడి ప్రజలు గాడిదలకు మిఠాయిలు తినిపించారు. అప్పుడు వర్షాలు కురవాలని కోరుకున్నారు. ఇప్పుడు కురుస్తున్నందుకు గులాబ్ జామూన్‌లు పెట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొంత మంది గాడిదపైకి ఎక్కి కాసేపు అటూ ఇటూ తిరిగారు. వ్యవసాయ భూముల్ని దున్నేందుకు ఎద్దులను కాకుండా గాడిదలనే వినియోగిస్తారు స్థానికులు. ఆ మట్టిలో ఉప్పు జల్లి ఆ తరవాత గాడిదలకు ఇలా మిఠాయిలు తినిపించడం ఇక్కడో ఆనవాయితీగా వస్తోంది. ఇక మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD ఇప్పటికే హెచ్చరించింది. మరి కొద్ది రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వెల్లడించింది. 


Also Read: Viral Video: ఇలా చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు - ఈయన సలహా విన్నారా?