Sudan telangana :   సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆపరేషన్ కావేరీలో ( భాగంగా భారత్‌కు తిరిగి వస్తున్న వారిలో తెలంగాణ  ప్రజలు ఉంటే వారికి సహాయం అందించేందుకు సిద్ధమైంది. ఇందులోభాగంగా ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వారి వివరాల కోసం విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటున్నామని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ప్రకటించారు. సూడాన్‌ చిక్కుకున్న భారతీయులు జెడ్డా నుంచి ఢిల్లీ, ముంబైకి ప్రత్యేక విమానాల్లో తిరిగి వస్తున్నారని చెప్పారు. బుధవారం భారత్‌కు చేరుకోనున్న వారిలో నలుగురు తెలంగాణకు చెందినవారు ఉన్నట్లు సమాచారం అందిందని వెల్లడించారు. ఢిల్లీ వచ్చే వారికి తెలంగాణ భవన్‌లో భోజనం, వసతి కల్పిస్తామన్నారు. ఇక్కడినుంచి హైదరాబాద్‌కు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.  
 
సూడాన్‌లో ఇంకా వేల మంది భారతీయులు


ఈశాన్య ఆఫ్రికా  దేశం సూడాన్ లో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వ దళాలకు, రెబెల్స్ కు మధ్య ఎడతెరిపి లేకుండా కాల్పులు  జరుగుతున్నాయి. ఇరు వర్గాలకు చెందిన వందలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు. అయినా యుద్ధం ఆగే అవకాశం కనిపించడం లేదు. దానితో  తమ పౌరులంతా జాగ్రత్తగా ఉండాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. అక్కడ నుంచి పౌరులను తరలించే బాధ్యతను భారత సైన్యానికి అప్పగించింది. విదేశీ  పౌరులను తరలించే  దిశగా ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు మూడు రోజుల  కాల్పుల విరమణకు వైరి  వర్గాలు అంగీకరించడంతో కొంత ఉపశమనం లభించింది.  


తరలింపు కోసం ఆపరేషన్ కావేరీ 
 
సూడాన్‌ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం  ఆపరేషన్ కావేరి చేపట్టింది.  ఇందులో భాగంగా రెండు యుద్ధ విమానాల ద్వారా మరో 250 మంది భారతీయులను తరలించారు. సూడాన్‌లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం తక్షణ చర్యలను ప్రారంభించింది. సూడాన్ నుంచి... అక్కడి నుంచి భారతీయులను రప్పించేందుకు ఆపరేషన్ కావేరిని ప్రారంభించింది. ఇప్పటికే అనేక మందిని సూడాన్ నుంచి భారత్ కు తరలించింది. ఇంకా కొంత మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకుపోయినట్లు పలు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందుతుండటంతో మరిన్ని విమానాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు రానున్నారు. ఆపరేషన్ కావేరీ పేరుతో జనాన్ని తరలించే ప్రక్రియను వీలైనంత త్వరలో ముగించి అందరినీ సురక్షితంగా దేశానికి తరలిస్తామని భారత సైన్యం ప్రకటించింది.  
   
ఆర్మీ విస్తృత సేవలు


విదేశాల్లో ఉన్న భారతీయులను  కాపాడేందుకు ఇండియన్ ఆర్మీ  ప్రతీ ఏడాది ఏదోక ఆపరేషన్  నిర్వహిస్తూనే ఉంది. కొవిడ్ - 19 టైమ్ లో వేర్వేరు దేశాల్లో ఉన్న 60 వేల మందిని తరలించేందుకు వందే  భారత్ మిషన్ నిర్వహించింది. దాదాపు అదే టైమ్ లో సముద్ర సేథు పేరుతో మరో నాలుగు వేల మందిని భారత తీరాలకు చేర్చింది. భారతీయ నౌకలు జలాశ్వా, ఐరావత్, శార్దూల్, మగర్ లు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి జనాన్ని తీసుకువచ్చాయి. ఈ మధ్యలో సముద్ర తుపానులు, సీ పైరెట్ల దాడులను తట్టుకోవాల్సిన వచ్చింది. బెల్జియంలో ఉగ్రదాడి జరిగినప్పుడు అక్కడున్న ఒక్క భారతీయుడి ప్రాణం  పోకుండా 240 మందిని స్వదేశానికి చేర్చారు. గల్ఫ్ దేశం యెమెన్ లో అంతర్యుద్ధంతో అల్లాడిపోతున్న 5,600 మంది భారతీయుల్ని స్వదేశానికి చేర్చేందుకు ఆపరేషన్ రాహత్ నిర్వహించారు.