Sangareddy Crime News: సంగారెడ్డి జిల్లాలో అత్తామామలను చంపడానికి ప్రయత్నించాడు ఓ వ్యక్తి. కరెంట్ షాక్ పెట్టి ప్రాణాలు తీయాలని పక్కాగా ప్లాన్ వేశాడు. కానీ అనుకోకుండా తన ప్లాన్ కు భార్యా బిడ్డలే గురికావాల్సి వచ్చింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేటలో జరిగింది.


అసలేం జరిగిందంటే..?


కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన రమేష్ కు సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం సంజీవన్ రావుపేటకు చెందిన మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే దంపతుల మధ్య కలహాల వల్ల భార్య మెట్టినింటిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. గత రెండేళ్లుగా అక్కడే ఉంటోంది. రమేష్ ఇంటికి రమ్మని ఎన్నిసార్లు అడిగినా రావడం లేదు. భార్య బిడ్డలు తన ఇంటికి రాకపోవడానికి అత్తామామలే కారణమని, వాళ్లే లేనిపోనివి చెప్పి రానివ్వడం లేదని రమేష్ వారిపై కోపం పెంచుకున్నాడు. ఈ నెల 12వ తేదీన రాత్రి అత్తగారింటికి వచ్చాడు. ఇంటి ప్రధాన ద్వారం మూసి ఉండగా.. బయటి నుంచే వారిని పిలిచాడు. ఎవరూ తలుపులు తెరవలేదు. భార్యాబిడ్డలను రెండేళ్లుగా ఇంటికి పంపించడం లేదని అప్పటికే అత్తామామలపై కోపంతో ఉన్న రమేష్.. అప్పటికప్పుడు వారిని చంపేయాలని నిర్ణయానికి వచ్చాడు. ఉన్నపళంగా ఓ పథకం రచించాడు.


అత్తగారింటి ప్రధాన ద్వారం పక్కనే ఉన్న విద్యుత్ మీటర్ నుంచి ఓ తీగను తలుపులకు బిగించాడు. ఓ బకెట్లో నీళ్లు పెట్టి.. ఇనుప రాడ్డును నీళ్లలో పెట్టి తలుపులకు అనుసంధానించాడు. తెల్లవారుజామున అత్తామామలు ఇద్దరిలో ఎవరో ఒకరు తలుపులు తీస్తారని, ఆ తలుపులకు కరెంట్ షాక్ వచ్చేలా పెట్టడంతో వారు విద్యుదాఘాతంతో చనిపోతారని రమేష్ అనుకున్నాడు. అయితే అత్తామామలు తలుపులు తీస్తారని అనుకుంటే రమేష్ భార్యాబిడ్డ ఆ తలుపు తీయడంతో వారు కరెంట్ షాక్ కు గురయ్యారు. విద్యుదాఘాతానికి గురైన వారు కేకలు వేయడంతో కుటుంబసభ్యులు ఇరుగుపొరుగు వెంటనే అక్కడికి వచ్చి కరెంటు తీగలను తొలగించారు.


కరెంటు షాక్ తగలడంతో రమేష్ భార్యాబిడ్డ ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అదో రోజు రమేష్ మామ.. దన్యాల రాములు పొలం వద్దకు వెళ్లగా.. పొలంలోని రెండు బోర్లు తగలబడిపోయి కనిపించాయి. బోర్లపై గడ్డి వేసి నిప్పు పెట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటి తలుపులకు విద్యుత్ షాక్, పొలంలోని బోర్లను తగలబెట్టడంతో రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒకే రోజు రెండు ఘటనలు జరగడంతో అనుమానాస్పదంగా భావించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటకు వచ్చింది.


రమేష్ మామ రాములుకు స్థానికంగా ఎవరితోనూ గొడవలు లేవు. అదే పోలీసులకు కలిసివచ్చింది. ఊర్లో వారు ఎవరూ చేసే అవకాశాలు లేకపోవడంతో మరో కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతికత ఆధారాలతో రాములు అల్లుడు రమేషే ఈ ఘటనలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. రమేష్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా రమేష్ తను చేసిన వాటిని ఒప్పుకున్నాడు. తానే తలుపులకు విద్యుత్ తీగలు పెట్టానని, పొలాల్లో బోర్లను తగలబెట్టానని ఒప్పుకున్నాడు. తలుపులు తెరవలేదన్న కోపంతోనే అత్తామామలను చంపాలనే తలుపులకు విద్యుత్ తీగలు తగిలించానని రమేష్ అంగీకరించాడు. పోలీసులు రమేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.