ఇప్పుడు డ్రగ్స్ వాడితే అది చాలా నేరం. మాదకద్రవ్యాలతో పట్టుబడిన వారు జైలు జీవితం గడపాల్సి వస్తుంది. అయితే ఈ డ్రగ్స్ వాడకం అనేది ఆధునిక కాలంలో మొదలైంది అనుకుంటే పొరపాటే, ప్రాచీన మానవులు సైతం మత్తు కలిగించే మందుల కోసం అల్లాడిపోయేవారు. వారు కూడా డ్రగ్స్‌ను తీసుకున్నారు అని చెబుతోంది ఒక అధ్యయనం. ఈ అధ్యయనం మాదక ద్రవ్యాల వినియోగం మొదలైంది ఈనాటిది కాదని, ప్రాచీన కాలం నుంచి ఉందనే సాక్ష్యాన్ని సంపాదించింది. ఇందుకోసం ఎన్నో ఏళ్ల పాటు పరిశోధకులు కష్టపడ్డారు. స్పెయిన్లోని మెనార్కా లోని స్మశాన వాటికలో 3000 నాటి సమాధులు ఉన్నాయి. ఆ స్మశాన వాటిక ఈనాటిది కాదు. కొన్ని వేలవేల క్రితం జీవించిన మానవులు ప్రత్యేకంగా ఒక గుహలో దీన్ని ఏర్పాటు చేసుకున్నారు.అందులో తమ తెగలో మరణించిన గొప్ప వ్యక్తులు, పాలకుల సమాధులను మాత్రమే నిర్మించారు. అందుకే 600 ఏళ్లలో కేవలం 210 మందిని మాత్రమే అక్కడ ఖననం చేశారు. ఆ వ్యక్తుల సమాధుల్లో రకరకాల వస్తువులను ఉంచారు. అలాగే వారి జుట్టును కత్తిరించి ఒక చిన్న డబ్బాలో భద్రపరిచి దేహం పక్కనే పెట్టారు. ఆ జుట్టును సేకరించారు శాస్త్రవేత్తలు. ఆ జుట్టులోనే మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన ఆధారాలు కనబడ్డాయి. 


ఎలాంటి డ్రగ్స్ వినియోగించారు?
పరిశోధకులకు దొరికిన ప్రాచీన కాలంనాటి జుట్టును రసాయన విశ్లేషణల ద్వారా పరిశీలించారు. అందులో  సైకోయాక్టివ్ ఆల్కలాయిడ్స్‌ను కనుగొన్నారు. ఇవి మనుషుల స్పృహపై ప్రభావం చూపిస్తాయి. ఇంకా ఆల్కలాయిడ్స్ ఎఫెడ్రిన్, అట్రోపిన్, స్కోపోలమైన్‌ వంటి డ్రగ్స్ జాడ కూడా కనిపించింది. అట్రోపిన్, స్కోపోలమైన్ ఈ రెండూ నైట్ షేడ్ మొక్కల కుటుంబానికి చెందినవి. ఇవి తింటే మతిమరుపు, భ్రాంతులు కలగడం, మైకం కమ్మడం వంటివి జరుగుతాయి. ఎఫెడ్రిన్ అనేది కొన్ని రకాల పొదలు మొక్కల్లో ఉత్పత్తి అవుతుంది. ఈ ఆకులను తినడం వల్ల ఉద్దీపన, ఉత్సాహం, చురుకుదనం వస్తుంది. 


పరిశోధనను బట్టి ఈ జుట్టు ఎవరికి చెందుతుందో ఆ వ్యక్తి తాను మరణించడానికి ముందు డ్రగ్స్ సేవించినట్టు తెలుస్తోంది. అందుకే ఆ జుట్టులో డ్రగ్స్ తాలూకు ఆధారాలు పుష్కలంగా ఉన్నాయి. డ్రగ్స్ వినియోగం ప్రాచీన కాలం నుంచి అధికంగానే ఉంది. మానవుడు మత్తు కలిగించే పదార్థాల కోసం ఆసక్తి చూపిస్తూనే ఉన్నాడు.  పురాతన కాలం నుంచి మత్తు పదార్థాల వాడకం కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పుడు మొక్కల ఆకుల రూపంలో, ద్రవాల రూపంలో దొరికిన డ్రగ్స్, ఇప్పుడు తెల్లటి పొడి రూపంలోకి మార్చి వాడుతున్నాడు మానవుడు.



Also read: పాలల్లో నీళ్లు కలిపితే అది కల్తీయే, కలిపారో లేదో ఈ చిన్న పరీక్ష ద్వారా తెలుసుకోండి

























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.