ఆహార పదార్థాలను కల్తీ చేయడం అనేది పెద్ద సమస్యగా మారింది. చాలామంది ఈ కల్తీ విషయాన్నీ పట్టించుకోకుండా అదే ఆహార పదార్థాలను వండుకొని తినేస్తున్నారు. అయితే ఆహారపదార్థాలు కల్తీ చేయడం వల్ల ఒక్కోసారి అది తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అందుకే తాము కొన్న పదార్థం కల్తీదో, స్వచ్ఛమైనదో తెలుసుకోవడం కోసం పరీక్ష చేయమని చెబుతుంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. చిన్న చిన్న పరీక్షల ద్వారా ఆహార పదార్ధం స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవచ్చు. ఆహారం కల్తీ చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదం బారిన పడుతుంది. భారతదేశంలో సాధారణంగా కనిపించే కల్తీ చేసే ఆహారాల్లో ప్రధానమైనది పాలు. పాలల్లో నీళ్లు కలుపుతారు. అయితే సాధారణంగా పాలను చూస్తే అవి కల్తీ అయినవో లేదో కనుక్కోవడం చాలా కష్టం. అందుకే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చిన్న పరీక్ష ద్వారా పాలల్లో నీళ్లు కలిపారో లేదో తెలుసుకోమని చెబుతోంది.
ఇందుకోసం ఒక వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది . ఆ వీడియోని బట్టి పాలల్లో నీళ్లు కలిపారో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం సాదా గాజు లేదా స్టీలు ప్లేటును తీసుకోవాలి. ఒకవైపు కొంచెం ఎత్తుగా ఉండేటట్టు అంటే వాలుగా ఉండేలా పట్టుకోవాలి. పెద్ద పాల చుక్కను ఆ ప్లేటుపై వేయాలి. ఆ పాలు జారకుండా ఉండిపోయినా, లేదా నెమ్మదిగా జారిన ఆ పాలు స్వచ్ఛమైనవి. అలా కాకుండా చుక్క ఇలా వేయగానే వేగంగా కిందకు జారిపోయిందంటే అందులో నీళ్లు కలిపారని అర్థం.
ఆ నీళ్లు కలిపితే...
పాలల్లో కలిపే నీరు మినరల్ వాటర్ అయితే ప్రమాదం లేదు. కానీ కల్తీ నీటిని వాడితే కలరా, డయేరియా, విరేచనాలు, హెపటైటిస్ A, టైఫాయిడ్ వంటివి నీటి ద్వారా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి పాలల్లో కలిపే నీళ్లు కూడా కల్తీ కానివే అయి ఉండాలి.
మరిగితే బ్యాక్టీరియా మరణిస్తుందా?
అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆహారాలను వేడి చేయడం వల్ల పరాన్న జీవులు, బ్యాక్టీరియా, వైరస్లు వంటివి చనిపోతాయి. అయితే పాలల్లో కలిపినవి ఫిల్టర్ చేయని కుళాయినీరు అయితే ఆ పాలను మరిగించినప్పటికీ కొన్ని రకాల సూక్ష్మజీవులు, రసాయనాలు నశించకుండా అలాగే ఉంటాయి. అవి శరీరంలో చేరితే హానికరమైన వ్యాధులకు కారణం అవుతాయి. పాలను కనీసం 20 నిమిషాలు మరిగించడం వల్ల కొన్ని వ్యాధికారక బ్యాక్టీరియాలు మరణించే అవకాశం ఉంది. అయితే క్లోస్ట్రిడియం బోటులినమ్ జాతి బ్యాక్టీరియాలు మాత్రం అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకొని నిలబడగలవు. వాటితోనే సమస్యలు వస్తాయి.
Also read: గర్భసంచిలో గడ్డలు ఎవరికి వస్తాయి? ఇవి వస్తే ప్రమాదమా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.