Stock market: స్టాక్‌ మార్కెట్ రెగ్యులేటర్ 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI), క్లయింట్ల ఫండ్స్‌పై కొత్తగా బ్యాంక్ గ్యారెంటీలను తీసుకోకుండా నిషేధం విధించింది. స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ మెంబర్స్‌కు ఈ నిషేధం వరిస్తుంది, వచ్చే నెల  1వ తేదీ ‍‌నుంచి అమలవుతుంది. స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ కార్పొరేషన్లు ప్రస్తుతం ఉన్న బ్యాంకు గ్యారెంటీలన్నింటినీ సెప్టెంబర్ చివరి నాటికి ఉపసంహరించుకోవాలని కూడా సెబీ ఆదేశించింది. 


“మే 1, 2023 నుంచి, స్టాక్ బ్రోకర్లు & క్లియరింగ్ మెంబర్స్‌ కస్టమర్ల డబ్బు నుంచి ఎటువంటి బ్యాంక్ గ్యారెంటీ తీసుకోలేరు. కస్టమర్ల నిధుల నుంచి ఇప్పటి వరకు తీసుకున్న అన్ని బ్యాంక్ గ్యారెంటీలను సెప్టెంబర్ 30, 2023 లోపు కవర్‌ చేయాల్సి ఉంటుంది" అని మంగళవారం జారీ చేసిన సర్క్యులర్‌లో SEBI పేర్కొంది.


కస్టమర్ల డబ్బును ఎలా ఉపయోగించుకుంటున్నారు?
ప్రస్తుతం.. ఖాతాదార్లు జమ చేసిన డబ్బును బ్యాంకుల వద్ద తాకట్టుగా పెట్టి, స్వప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ మెంబర్లు. అదే మొత్తాన్ని బ్యాంకు గ్యారెంటీల రూపంలో అధిక లాభాల కోసం క్లియరింగ్ కార్పొరేషన్లకు బ్యాంకులు జారీ చేస్తాయి. ఈ ప్రక్రియలో వినియోగదార్ల డబ్బు మార్కెట్ నష్టాలకు గురవుతుంది. దీనిని నివారించడానికి సెబీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అయితే, స్టాక్ బ్రోకర్లు & క్లియరింగ్ మెంబర్ల యాజమాన్యంలో ఉన్న నిధులకు కొత్త నిబంధన వర్తించదు.


మార్కెట్‌ నిపుణుల మాటేమిటి?
"ఖాతాదార్ల డబ్బును ఉపయోగించడం ద్వారా స్టాక్‌ బ్రోకర్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. మార్కెట్‌ పరిస్థితి తారుమారై, రిస్క్ పెరిగినపుడు క్లయింట్ల ఫండ్‌ స్తంబించిపోతుంది, మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. అలా డబ్బు చలామణి చేయడం ఇకపై కుదరదని ఈ సర్క్యులర్ ఆధారంగా సెబీ నిర్ధరించింది" - సామ్‌కో సెక్యూరిటీస్ వ్యవస్థాపకుడు మరియు CEO అయిన జిమీత్ మోదీ.


జిమీత్ మోదీ చెబుతున్న ప్రకారం... ఈ రోజు, కస్టమర్ ఖాతాలో ఉన్న రూ. 100 ఫండ్‌పై సంబంధిత స్టాక్ బ్రోకర్ రూ. 100 ఫిక్స్‌డ్ డిపాజిట్‌ని సృష్టించి, ఆపై రూ. 100 అదనపు బ్యాంక్ గ్యారెంటీ తీసుకోవచ్చు. ఈ విధంగా రూ. 100 ఫండ్‌తో మొత్తం పూచీకత్తు రూ. 200 వరకు తీసుకోవచ్చు. ఈ అదనపు బ్యాంక్ గ్యారెంటీ & 100 రూపాయల పరపతి బ్రోకర్ ఖాతాకు వస్తుంది. అయితే, అసలు ఆ డబ్బు మొత్తం వినియోగదార్లది. ఇది ఒక మార్కెట్‌లో బ్లాక్ స్వాన్ ఈవెంట్‌కు (black swan event) దారి తీయవచ్చు. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.