Tearful Incident in Narayanpet District: అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు తమ కళ్ల ముందే దూరమైతే ఆ తల్లిదండ్రుల బాధను వర్ణించలేం. తన బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి చిన్నారి సమాధి వద్దే రోధిస్తూ పడుకున్నాడు. సమాధిని గట్టిగా కౌగిలించుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. దీన్ని గమనించిన బంధువులు ఆ తండ్రిని ఓదార్చి తమ వెంట ఇంటికి తీసుకెళ్లారు. గుండెలను పిండేసే ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నారాయణపేట (Narayanpet) జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు.. ఆ తండ్రి బాధ మరెవరికీ రాకూడదని పేర్కొంటున్నారు. 

Continues below advertisement


ఇదీ జరిగింది


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా గోపాల్ పేట వీధికి చెందిన లక్ష్మీ ప్రణీత (12) తన స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంది. ఓ వాటర్ ట్యాంక్ వద్ద ఆడుకుంటుండగా.. అది ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో లక్ష్మీ ప్రణీతతో పాటు మరో అమ్మాయికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రణీత ప్రాణాలు కోల్పోయింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అదే రోజు సాయంత్రం లక్ష్మీ ప్రణీత అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె తండ్రి రమేష్ స్నానం చేసిన వెంటనే బయటకు వెళ్లాడు. రాత్రి 11 దాటినా ఇంకా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా.. ఫలితం లేకపోయింది. అనుమానం వచ్చి ప్రణీతను పూడ్చిపెట్టిన ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ సమాధి వద్దే రమేష్ పడుకుని విలపించడాన్ని గమనించారు. అతన్ని సముదాయించి ఇంటికి తీసుకొచ్చారు. ఈ ఘటన అక్కడి వారిని కంటతడి పెట్టించింది.


Also Read: Part Time Jobs Scam: పార్ట్ టైం ఉద్యోగాల స్కాం - రంగంలోకి ఈడీ, రూ.32.34 కోట్లు అటాచ్