Ed Attached 32.24 Crores In Part Time Jobs Scam: నిరుద్యోగుల ఆశలు, అవసరాలను ఆసరాగా తీసుకున్న కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పార్టీ టైం ఉద్యోగాల (Part Time Job Scam) పేరిట భారీ మోసానికి తెరలేపగా.. ఒక్క హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ లోనే 50కి పైగా ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. సీసీఎస్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తుండగా.. ఆ కేసు ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కాంలో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్ చేసినట్లు వెల్లడించారు.
ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు పలు వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ ద్వారా నిరుద్యోగులకు వల వేశారు. బోగస్ మొబైల్ అప్లికేషన్లు సృష్టించి పెట్టుబడులు పెట్టించారు. హోటల్స్, టూరిస్ట్ వెబ్ సైట్స్, రిసార్టులు వంటి వాటికి రేటింగ్ ఇస్తే ఆదాయం వస్తుందని నిరుద్యోగులను నమ్మించారు. యూఏఈలో ఉన్న నేరగాళ్ల ముఠా ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. భారత్ లో బ్యాంకు ఖాతాలు సేకరించి వాటిలో సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును ఆ ఖాతాలకు మళ్లిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే కాక.. దేశవ్యాప్తంగా రూ.524 కోట్లు కాజేసినట్లు గుర్తించింది. ఇప్పటి వరకూ 175 ఖాతాల ద్వారా ఈ నగదు కాజేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ నగదును మరో 480 ఖాతాలకు మళ్లించి క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో దేశం దాటిస్తున్నట్లు తేలింది.