ED Raids In TS : తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగానే గ్రానైట్ వ్యాపారుల అవకతవకలపై సోదాలు నిర్వహించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారిక ప్రకటన చేసింది. రెండు రోజుల పాటు మంత్రి గంగుల కమకలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు చెందిన వ్యాపార సంస్థలపై దాడులు చేశారు. ఈ సోదాల అనంతరం ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసిందిది. ఈడీ జారీ అధికారిక ప్రకటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, PSR గ్రానై
ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ... అలాగే వారి సంబంధిత సంస్థలపై కరీంనగర్, హైదరాబాద్‌లో FEMA ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలతో సోదాలు నిర్వహించామని ఈడీ తెలిపింది. ఈ సంస్థలు చైనా, హాంకాంగ్ S.A.R, ఇతర దేశాలకు భారీ ఎత్తున గ్రానైట్ బ్లాక్‌లను ఎగుమతి చేస్తున్నాయి. అయితే రాయల్టీ చెల్లించిన పరిమాణం కంటే ఎగుమతి చేసిన పరిమాణం ఎక్కువగా ఉందని రికార్డులు వెల్లడయ్యాయి. ఎగుమతి చేసేటప్పుడు పరిమాణం తక్కువ చూపించి పన్నులు ఎగ్గొట్టారని తేలింది. ఎగుమతి ఆదాయం బ్యంక్ ఖాతాలలో కనిపించలేదని.. తద్వారా ఎగుమతి ఆదాయం బ్యాంకింగ్ మార్గాల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా స్వీకరించారని గుర్తించినట్లయిందని ఈడీ తెలిపింది. అంటే హవాలాకు పాల్పడ్డారని భావిస్తున్నారు.
సోదాల సందర్భంగా ఈడీ సెర్చ్ బృందాలు లెక్కల్లో చూపని రూ. 1.08 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎగుమతులు చేసినందుకు గాను.. హవాలాలో పొందినట్లు ఆరోపణలు ఉన్న నగదు.. క్వారీల నుండి 10 సంవత్సరాల భారీ గ్రానైట్ డిస్పాచ్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. సోదాల్లో గ్రానైట్ ఎగుమతిదారుల ఉద్యోగుల పేరుతో అనేక బినామీ బ్యాంకు ఖాతాలను కూడా ED సెర్చ్ బృందాలు గుర్తించాయి, వీటిలో అక్రమ గ్రానైట్ ఎగుమతులపై వచ్చిన నగదు జమ చేసినట్లుగా ఈడీ తెలిపింది. పత్రాలు లేకుండా చేతి రుణాల రూపంలో చైనీస్ సంస్థల నుండి భారతీయ సంస్థలకు డబ్బు తిరిగి మళ్లించారనే విషయాన్ని కూడా గుర్తించారు. ఈ చైనీస్ సంస్థలు పనామా లీక్స్‌లో కనిపించిన లి వెన్‌హువోకు చెందినవని ఈడీ ప్రకటించింది.
అసలు ఈడీ సోదాల్లో ట్విస్ట్ ఉంది. కరీంనగర్ జిల్లాలోని క్వారీ లీజు ప్రాంతాల నుంచి సముద్రమార్గం ద్వారా రవాణా చేసిన గ్రానైట్ బ్లాకులపై పెద్ద ఎత్తున సీగ్నియరేజ్ ఫీజు ఎగవేతకు పాల్పడినట్లుగా తెలంగాణ ప్రభుత్వమే నివేదిక ఇచ్చిందని ఈడీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నివేదిక ఆధారంగా అక్రమ గ్రానైట్ మైనింగ్ , ఫెమా ఉల్లంఘనలపై ED దర్యాప్తు ప్రారంభించామని తెలిపింది. దర్యాప్తులో మోసం అంతా బయటపడిందన్నారు. తదుపరి విచారణ పురోగతిలో ఉందని ఈడీ తెలిపింది. ఈడీ ప్రకటన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు వల్లనే సోదాలు చేసినట్లుగా క్లారిటీ వచ్చినట్లయింది.