Farm House Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు .. పోలీసులు నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీలో పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా నిందితుల వాయిస్‌ను రికార్డింగ్ చేశారు. నిందితుల వాయిస్ పరిశీలన పరీక్షలు చేయనున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల్లో బయటపడిన ఆడియో, వీడియోల్లోని వాయిస్‌ను అధికారులు పోల్చి చూడనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో FSL నివేదిక కీలకం కానుంది. మరోవైపు శుక్రవారంతో నిందితుల కస్టడీ ముగియనుంది. నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులను గురువారం ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. కస్టడీ తర్వాత ఇవాళ ముగ్గురు నిందితులను కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించనున్నరాు. మరోవైపు నిందితుల బెయిల్ పిటిషన్‌పై ఏసీబి కోర్టు విచారణ జరుపనుంది.
నగదు ఎక్కడి నుంచి తెస్తారో వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు
ఇక నిందితుల వద్ద లభించిన నకిలీ ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్, వంద కోట్ల డీల్ పై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తొలి రోజు పోలీసులు నిందితుల్ని 42 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రశ్నలపై ఉదయం ఒక్కొక్కరిని వేర్వేరుగా, మధ్యాహ్నం కలిపి ప్రశ్నించారు. 17 ప్రశ్నలకు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు. వీటిపై శుక్రవారం విచారణలో స్పష్టత తీసుకునేందు కు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆధారాలను, ఫామ్‌హౌ్‌సలో రికార్డ్ చేసిన ఆడియో, వీడియోలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వాటిని కోర్టు అనుమతితో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ కేసులో ఆధారాలన్నీ డిజిటల్ డేటాకు సంబంధించినవి కావడంతో.. ఫోరెన్సిక్ నివేదిక అత్యంత కీలకమైనవని పోలీసులు చెబుతున్నారు.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి రూ. 100 కోట్లు అతనితోపాటు వచ్చే వారికి ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 50కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని టేపుల్లో ఉంది. స్వామిజీల పేరుతో ఇద్దరు నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. బీజేపీ కుట్రను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బయటపెట్టగా.. టీఆర్‌ఎస్ డ్రామా ఆడుతోందని బీజపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో బీజేపీ తరఫున రామచంద్రభారతి బేరసారాలు జరిపిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియోతో పాటు ఎవరు ఎవరితో బేరసారాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు. ఎంత పెద్ద మొత్తంలో డీల్ నడుస్తోంది అనే రెండో వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది.
కస్టడీలో కీలక అంశాలపై ప్రశ్నించిన పోలీసులు
మొత్తం 27 నిమిషాల నిడివిగల ఈ ఆడియోలో నందు అనే వ్యక్తి రామచంద్రభారతి, సింహయాజి అనే ఇద్దరు స్వామీజీలతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై చేసిన సంభాషణ ఉంది. కస్టడీలో వీటిపైనే ప్రధానంగా వివరాలు సేకరిస్తున్నారు. బీజేపీ పెద్దలతో జరిగిన సంభాషణలు, రామచంద్రభారతితో ఉన్న సంబంధాలపైనా పోలీసులు ఆరా తీశారు. వారితో తమకు ఎక్కువగా సంబంధాలు లేవని, ఆర్‌ఎస్‌ఎస్‌లో తిరుగుతామని సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు సాంకేతిక ఆధారాలను, వాట్సాప్ సంభాషణలు, అందులోని కోడ్ పదాలను ముందుపెట్టి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపే యోచనలో సిట్
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ సభ్యులు గురువారం సమావేశమై, ఈ కేసు దర్యాప్తును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై చర్చించారు. నిందితుల నుంచి సేకరించే వివరాలు, సాంకేతిక అంశాలు, డాక్యుమెంటేషన్ ఇలా విభజించి మూడు బృందాలకు అప్పగించారు. నిందితుల నుంచి తొలిరోజు సేకరించిన వివరాలను విశ్లేషించిన సిట్ అధికారులు.. నిందితుల నుంచి మున్ముందు సేకరించాల్సిన సమాచారంపై బృందం సభ్యులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. దీంతోపాటు విచారణలో వెల్లడవుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుని కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ముంబయి, హర్యానా లకు ప్రత్యేక బృందాలను పంపేందుకు తెలంగాణ పోలీసులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.