Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో నిఘా కోసం అమర్చిన సీసీటీవీలు చాలా వరకు పని చేయడం లేదు. దీంతో నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషించే వీడియో సాక్ష్యాధారాలు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి. తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిధిలో ప్రతి వ్యక్తి కదిలికలను గుర్తించడానికి, నేరాలను నియంత్రించడానికి పోలీసులు దాదాపు 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కొండగట్టులో జరిగే ప్రతి సంఘటనను హైదరాబాదులోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. కొండగట్టు, దొంగల మర్రి, మల్యాల క్రాస్ రోడ్డు, మండల పరిషత్ చౌరస్తాలో అమర్చిన సీసీ కెమెరాలను మల్యాల టానాతో పాటు కొండగట్టులోని పోలీసు పోస్టుకు అనుసంధానం చేశారు. 


సీసీ కెమెరాల ఏర్పాటు కోసం 20 లక్షలు మంజూరు..


సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ రూ.20 లక్షలు మంజూరు చేశారు. అయినప్పటికీ సీసీ కెమెరాల పని తీరుపై పర్యవేక్షణ లోపించడంతో నెలన్నర క్రితం నుంచి కొండగట్టు అంజన్న ఆలయ పరిధిలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. తరచుగా గుర్తు తెలియని వ్యక్తులు భక్తుల నుంచి డబ్బులు చోరీ చేసే సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఓదెలకు చెందిన మహిళ భక్తుల నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఆలయం ముందే పర్సు దొంగతనం చేసిన సంఘటన కలకలం రేపింది. పర్సులోని రూ.40000తో పాటు వివిధ రకాల గుర్తింపు కార్డులు కూడా చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై భక్తులు ఫిర్యాదు చేస్తే నిందితుడిని గుర్తించడానికి ఆలయ పరిధిలోని సీసీ కెమెరాలు పని చేయడం లేదని రక్షణ సిబ్బంది పేర్కొన్నట్లు బాధితులు తెలిపారు. 




ప్రధాన ప్రాంతాల్లో మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలి..


లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు, పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేసి సెక్యూరిటీ సిబ్బందిని కూడా నియమించినా కొండగట్టులో తరచూ చాలా రకాల నేరాలు జరుగుతుండడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టు అంజన్న ఆలయం ముందు ఏర్పాటు చేసిన పోలీసు అవుట్ పోస్టులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పర్యవేక్షణ గదిని సాంకేతిక సిబ్బంది పరిశీలించి సీసీ కెమెరాల మరమ్మతులు చేపట్టారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ప్రతిరోజు సీసీ కెమెరాల పని తీరుపై పర్యవేక్షించాలని భక్తులు సూచిస్తున్నారు. అదే విధంగా ఆలయానికి ప్రధాన ప్రాంతాల్లో మరిన్ని సీసీ కెమెరాలను అమర్చాలని కోరుతున్నారు.


తాళాలు పగులగొట్టి మరీ చోరీలు..


మరోవైపు ఈ మధ్యే వేములవాడలో రాజన్న దర్శనార్థం వచ్చిన ఇద్దరు భక్తులు కుటుంబాలతో సహా బస చేసిన వసతి గృహాల్లో తాళాలు పగలగొట్టి మరీ సొమ్ము సెల్ ఫోన్లు దొంగతనం చేశారు. అయితే సీసీటీవీలు పరిశీలించమని కోరితే ఆలయ సిబ్బంది నీళ్లు నమలడంతో వివాదం కాస్త పోలీస్ స్టేషన్ వరకు చేరింది. దీనికి కూడా సరిగా పని చేయని సీసీ కెమెరాలే అని అనుమానం వ్యక్తం అయింది. దొంగతనాలు లాంటి చిన్న కేసులను వదిలేస్తే ఇతర తీవ్రనేరాల విషయంలో సరైన సీసీటీవీ ఫుటేజ్ లేకుంటే అవి ఎప్పటికీ పోలీసు శాఖకు కూడా మాయని మచ్చ తెచ్చే కేసులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి అటు పోలీసు అధికారులైనా ఇటు ఆలయ సిబ్బంది అయినా త్వరితగతిన ఈ సమస్యని పరిష్కరించుకోవడం ఉత్తమం.