Karimnagar Crime : కరీనంగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరులో హత్య కలకలం సృష్టించింది. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మేదరి శ్రీనివాస్ ను అదే గ్రామానికి చెందిన గౌరవేణి జయంత్ అతని భార్య శారదతో పాటు గౌరవేని అజయ్ లు కలిసి హత్య చేసినట్లు చెప్పారు. శ్రీనివాస్ గ్రామంలో ఉపాధి హామీ క్షేత్ర స్థాయి పరిశీలకుడిగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. జయంత్ తన భార్యతో పాటు కలిసి పొలం పనులతో పాటు కూలి పనులు చేసేవాడని వివరించారు. పనులకు వెళ్లకుండా శారద ఇంట్లో ఉండడంతో అనుమానం వచ్చి భర్త ఏమైందని ప్రశ్నించాడు. శ్రీనివాస్ తనతో అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని భర్తకు శారద చెప్పింది. ఈ క్రమంలో శ్రీనివాస్ ను హత్య చేసేందుకు తన చిన్నాన్న కొడుకు అజయ్ తో కలిసి ప్లాన్ వేశారు. అనుమానం రాకుండా జయంత్, అజయ్ లు కలిసి శ్రీనివాస్ తో స్నేహంగా ఉన్నారు.
మృతదేహం పాతిపెట్టిన చోట షెడ్డు
ఈనెల 5వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో జయంత్.. శ్రీనివాస్ ను పార్టీ చేసుకుందామని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. జయంత్ ఇంటికి వెళ్లి అజయ్ తో కలిసి మద్యం సీసా తీసుకొని గ్రామ శివారులోని ఓ పశువుల కొట్టం దగ్గరికి వెళ్లి ముగ్గురు కలిసి మద్యం తాగారు. అక్కడే ఉన్న తాడును తీసుకొని శ్రీనివాస్ మెడకు చుట్టి హత్యకు పాల్పడ్డారు. అక్కడి నుంచి జయంత్ వ్యవసాయ బావి దగ్గరకు ద్విచక్ర వాహనంపై శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకెళ్లి మొరం కుప్పని తవ్వి అందులో పాతిపెట్టారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన జయంత్ తన భార్య శారదకు జరిగిన విషయం గురించి చెప్పారు. పోలీసులకు అనుమానం రాకుండా శ్రీనివాస్ బట్టలను తగలబెట్టినట్లు చెప్పాడు. మర్నాడు ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ట్రాక్టర్ తో మృతదేహం పాతిపెట్టిన చోట చదును చేశారు. అక్కడే ఓ షెడ్డు నిర్మాణం చేపడితే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుందని ఐడియా వేశారు. ఈనెల 7న సైదాపూర్ పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ కనపడడం లేదని అతని సోదరుడు శ్రీధర్ పోలీసులకు కంప్లైంట్ చేయగా పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే భయంతో జయంత్ తన భార్య శారద ఇద్దరు పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు ఏసీపీ చెప్పారు.
మరో హత్య కేసులో పీడీ యాక్ట్ అమలు
కరీంనగర్లోని ఆదర్శనగర్ వద్ద కారుతో ఢీ కొట్టించి హత్య చేయించిన ముగ్గురు నిందితులపై కరీంనగర్ పోలీసుల పీడీ యాక్ట్ అమలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం పెరకబండ గ్రామంలో బంధువుల భూమి పంచాయితీ విషయమై కరీంనగర్ ఆదర్శనగర్ కు చెందిన రావుల శ్రీనివాస్ అండగా నిలిచారు. ఇదే వివాదంలో ఎదుటి వర్గానికి చెందిన పెరికబండ గ్రామానికి చెందిన దుబ్బాసి పరశురాములు అలియాస్ ప్రశాంత్ అలియాస్ మున్న (26) రావుల శ్రీనివాస్ పై కక్ష పెంచుకున్నాడు. తన మిత్రులు ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేటకు చెందిన బొల్లం శ్రీధర్ అలియాస్ చింటూ( 22) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి చీరల వంచ గ్రామానికి చెందిన మామిడి వేణు అలియాస్ రైడర్(28)లతో కలిసి శ్రీనివాస్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. కరీంనగర్ లోని ఆదర్శనగర్ లో నివాసం ఉంటున్న రావుల శ్రీనివాస్ అతని భార్య రుశింద్రమనితో కలిసి ఈ ఏడాది మే 8వ తేదీ రాత్రి 11 గంటలకు చర్చిలో ప్రార్థనలు చేసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్నారు. సుమోతో వారిని ఢీ కొట్టించారు. ఈ ఘటనలో శ్రీనివాస్ రుషింద్రమణిలు గాయపడ్డారు. రుషింద్రమణి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 16వ తేదీన మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను జూన్ 23న అరెస్టు చేసి జైలుకు పంపించారు. హైదరాబాద్ లోని చర్లపల్లి జైలులో ఉన్న నిందితులకు హైదరాబాద్ కరీంనగర్ లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ దామోదర్ రెడ్డి బుధవారం జైలర్ సమక్షంలో పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందించారు.