PM Modi Visakha Tour : ప్రధాని మోదీ విశాఖ పర్యటన వేళ బీజేపీ- వైసీపీ క్రెడిట్ గేమ్స్ ప్రారంభించాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్లుపై ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయాలకు తావు లేదంటూనే ఇరు పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నారు. విశాఖ రైల్వే జోన్ పై మాత్రం రెండు పార్టీలూ నోరుమెదపడంలేదు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనపై వైసీపీ, బీజేపి నేతలు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖలో ప్రధాని రోడ్ షో కూడా ఉండటంతో బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్రధాని పాల్గొనే కార్యక్రమాలకు భారీగా జన సమీకరణ చేసేందుకు వైసీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ వేదికగా జరుగుతున్న ప్రధాని పర్యటన కావటంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారంలో ఉన్న వైసీపీ ప్రధానికి స్వాగతం పలుకుటుంటే, పార్టీ పరంగా కాషాయ దళం మోదీని అపూర్వ రీతిలో రిసీవ్ చేసుకోవటానికి శ్రేణులు ఉర్రూతలు ఊగుతున్నాయి. ప్రధాని పర్యటన ఉంటే ప్రధాన రహదారులన్నింటినీ బీజేపీ నేతలు కాషాయ రంగు స్వాగతతోరణాలతో నింపేశారు. మోదీకి స్వాగతం పలికేందుకు భారీగా వాహన శ్రేణిని కూడా బీజేపి నేతలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఇప్పటికే కీలక నేతలు ప్రత్యేకంగా సమావేశం అయ్యి, ఏర్పాట్లపై చర్చించారు.
ప్రధాని పర్యటనలో కీలకంగా ఎంపీ విజయసాయి రెడ్డి
ప్రధాని పర్యటన వైసీపీ, బీజేపి నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. మోదీ పర్యటనపై వైసీపీ ఎంపీ విజయ సాయి రూట్ మ్యాప్ ను ఖరారు చేయటంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యంతరం తెలిపారు. ప్రధాని స్థాయిలో వ్యక్తి రాష్ట్రానికి వస్తుంటే, ఆయన షెడ్యూల్ ను ప్రకటించటానికి విజయ సాయి రెడ్డికి ఏం హక్కు ఉందని నిలదీశారు. మరో వైపున వైసీపీ పరంగా, ఏపీ ప్రభుత్వ పరంగా కూడా విజయసాయి రెడ్డి ప్రధాని పర్యటనలో కీలకంగా వ్యవహరం నడిపిస్తున్నారు. అన్ని పనులను విజయసాయి దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రధాని వచ్చిన తరువాత నుంచి తిరుగు ప్రయాణం అయ్యే వరకు అన్ని ఏర్పాట్లు చేసే విషయంలో విజయసాయి రెడ్డికి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారని పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతుంది.
విశాఖలో సీఎం జగన్ టూర్ షెడ్యూల్
ఏపీ సీఎం జగన్ రేపు, ఎల్లుండి విశాఖలో పర్యటించనున్నారు. విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ స్వాగతం పలికి, తిరిగి వీడ్కోలు పలికే వరకు జగన్ ప్రధాని వెంట ఉండనున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే ఖరారు అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు విశాఖలోనే మకాం వేస్తారు.
11వ తేదీ షెడ్యూల్
సీఎం జగన్ 11వ తేదీన గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటిస్తారు. అనంతరం మధ్యాహ్నాం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 5.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 6.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. సాయంత్రం 6.35 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుని ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం రాత్రికి పోర్ట్ గెస్ట్‌హౌస్‌లో బసచేస్తారు.
12వ తేదీ షెడ్యూల్
12వ తేదీ ఉదయం 10.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. 10.20 గంటలకు ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలుకుతారు. 10.30 – 11.45 గంటల వరకు ప్రధానితో కలిసి పలు శంకుస్థాపనలు, ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. 12.45 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.