Indian Railways: ప్రయాణీకుల కోసం భారతీయ రైల్వే శాఖ అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. పెరుగుతున్న సాంకేతికతను జోడిస్తూ, రైలు ప్రయాణాలను సులువుగా మారుస్తోంది. ఇవాళ, అలాంటి కొత్త సదుపాయం గురించి మీకు చెప్తాం. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే... టికెట్ లేకపోయినా మీరు రైలు ఎక్కవచ్చు. అయితే.. ప్రయాణం ఫ్రీ కాదని మాత్రం గుర్తు పెట్టుకోండి.


భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దది. ప్రతిరోజూ 13,169 ప్యాసింజర్ రైళ్లు ‍‌(లాంగ్‌ డిస్టాన్స్‌, సబర్బన్ మార్గాల్లో) నడుస్తున్నాయి. ఇవి, దేశవ్యాప్తంగా 7,325 స్టేషన్లను కలుపుతూ 1,15,000 కిలోమీటర్లను కవర్ చేస్తుంటాయి. ప్రతిరోజూ 2.30 కోట్లకు పైగా ప్రజలు భారతీయ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఇది ఆస్ట్రేలియా మొత్తం జనాభాకు సమానం.


రైల్వేలో సగటున రోజుకు 5 లక్షల టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. వీటిలో 55% టిక్కెట్లను రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో ప్రజలు కొంటుండగా, 37% టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. 8% టికెటింగ్ ఏజెంట్ల ద్వారా జరుగుతోంది.


టిక్కెట్‌ లేని ప్రయాణం
ఒక్కోసారి మనకు అనుకోని ప్రయాణం పడుతుంది. ముందస్తు ప్రణాళిక లేకుండా హడావిడిగా రైల్వే స్టేషన్‌కు పరిగెత్తాల్సి వస్తుంది. లేదా.. ట్రాఫిక్‌లో చిక్కుకునో, మరో కారణం వల్లో స్టేషన్‌కు చేరడం ఆలస్యమై, జర్నీ టిక్కెట్‌ తీసుకునే సమయం కూడా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో టిక్కెట్‌ లేకుండానే రైల్లోకి ఎక్కేస్తాం. కొందరైతే, ముందుగానే స్టేషన్‌కు చేరుకున్నా అక్కడి క్యూ లైన్‌లో నిలబడలేక టిక్కెట్‌ తీసుకోకుండానే బోగీలోకి ఎక్కుతారు.


ఇలా టిక్కెట్‌ లేకుండా రైల్లోకి ఎక్కిన వాళ్లు ట్రావెలింగ్‌ టిక్కెట్‌ ఎగ్జామినర్‌ (TTE) చేతికి చిక్కి, నగదు రూపంలో ఛార్జ్‌ లేదా ఫైన్‌ కట్టి గమ్యస్థానం వరకు టిక్కెట్‌ తీసుకుంటుంటారు. ఆ సమయంలో మీ దగ్గర సరిపడా డబ్బు లేకపోతే పరిస్థితి ఏంటి?. దీనికి పరిష్కారంగా.. డెబిట్‌ కార్డ్ ద్వారా కూడా మీరు ఆ పెనాల్టీ చెల్లించవచ్చు. TTE దగ్గర ఉండే పాయింట్ ఆఫ్ సెల్లింగ్ (PoS) మెషీన్ల ద్వారా మీ డెబిట్‌ కార్డ్‌తో డబ్బు చెల్లించవచ్చు. 


2G నుంచి 4Gకి మారుతున్న రైల్వే 
గతంలో, TTE వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సెల్లింగ్ మెషీన్లను 2G సిమ్‌తో అనుసంధానించారు. రైలు ఒక నగరం లేదా పట్టణం దాటి దూరంగా రాగానే నెట్‌వర్క్ సమస్యలు తలెత్తేవి. డెబిట్‌ కార్డ్‌తో ఛార్జ్‌ లేదా ఫైన్‌ కట్టడానికి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ ఇబ్బందులను సవరిస్తూ.. TTEల దగ్గర ఉండే ఎలక్ట్రానిక్‌ పరికరాలను రైల్వే విభాగం 4G సిమ్‌తో అనుసంధానం చేస్తోంది. ఇప్పుడు సిగ్నల్స్‌ బాగుంటాయి కాబట్టి, టిక్కెట్‌ లేకుండా రైలు ఎక్కినా ఇబ్బందులు లేకుండా డబ్బులు చెల్లించవచ్చు.


రైల్వే శాఖ నిబంధనల ప్రకారం... రిజర్వేషన్‌ టిక్కెట్‌ లేకుండా రైల్లోకి ఎక్కాల్సి వస్తే, మీ దగ్గర కచ్చితంగా ప్లాట్‌ఫాం ఉండాలి. అంటే, ఫ్లాట్‌ఫాం టికెట్‌ తీసుకుని మాత్రమే రైలు ఎక్కాలి. లేకపోతే, అక్రమంగా ప్రయాణిస్తున్నట్లు భావించి భారీ జరిమానా విధించే అవకాశం ఉంటుంది.