T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో టీమిండియా పోరాటం ముగిసింది. సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలై అవమానకరరీతిలో మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. పదేళ్ల కప్పు నిరీక్షణకు తెరదించకుండానే ఇంటికి వెళ్లింది. కర్ణుడి చావుకు లక్ష కారణాలున్నాయో లేదో తెలియదు కానీ.. టీమిండియ ఘోర వైఫల్యానికి మాత్రం చాలా కారణాలున్నాయి. 


2021 టీ20 ప్రపంచకప్ లో వైఫల్యం అనంతరం టీమిండియా 2022 కప్పే లక్ష్యంగా అడుగులు వేసింది. కొత్త కెప్టెన్, కొత్త కోచ్, కుర్రాళ్లతో లక్ష్యం దిశగా ముందడుగేసింది. ఈ ఏడాదిలో చాలా టీ20 మ్యాచులు ఆడింది భారత జట్టు. యాజమాన్యం చాలామంది ఆటగాళ్లకు అవకాశాలిచ్చింది. కుర్రాళ్లను పరీక్షించింది. జట్టును తయారుచేసుకుంది. కానీ... కప్పు మాత్రం గెలవలేకపోయింది. ఎందుకు?


ఎంపిక లోపం


ప్రపంచకప్ లో వైఫల్యానికి కారణాలేవంటే ప్రధానంగా జట్టు ఎంపికలోనే లోపం కనబడుతోంది. ఏడాదిగా ఎంతో మంది కుర్రాళ్లకు అవకాశమిచ్చినా.. ఎవరినీ జట్టులో కుదురుకోనివ్వలేదు. ఒకట్రెండు మ్యాచుల్లో విఫలమవగానే వారిని తప్పించారు. అందుకే అర్హదీప్ తప్ప కొత్త కుర్రాళ్లెవరూ మెగా టోర్నీ జట్టులో చోటు సంపాదించలేకపోయారు. ఇక ఏడాదిగా టీ20లు ఆడని మహ్మద్ షమీని, టీ20ల్లో పెద్దగా రాణించని అశ్విన్ కు అవకాశం ఇచ్చారు. ఒకటీ అరా తప్ప పెద్ద ఇన్నింగ్సులు ఆడని దీపక్ హుడాను జట్టులోకి తీసుకున్నారు. వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఎంపికా చర్చనీయాంశమే. 


ఓపెనర్ల ఘోర ప్రదర్శన


టీ20ల్లో ఓపెనర్లది కీలకపాత్ర. మొదటి 6 ఓవర్లలో వారు చెలరేగి ఆడి మంచి స్కోరు అందిస్తే.. తర్వాత వచ్చే బ్యాటర్లు దాన్ని భారీ స్కోరుగా మలుస్తారు. అయితే మన ఓపెనర్ల ద్వయం రోహిత్- రాహుల్ ప్రపంచకప్ లో ఏ మ్యాచులోనూ మంచి ఆరంభానివ్వలేదు. భాగస్వామ్యాల సంగతి పక్కనపెడితే కనీసం ఆ 6 ఓవర్లో 50 పరుగులు చేయలేదు. ఇది టీమిండియా కొంప ముంచింది. ఓపెనర్లు వెంటవెంటనే ఔటవటంతో తర్వాత వచ్చే వారిపై ఒత్తిడి పడింది. అది స్కోరు మీద ప్రభావం చూపించింది. కేఎల్ రాహుల్ చిన్న జట్లు బంగ్లాదేశ్, జింబాబ్వేపై అర్థశతకాలు మినహా మిగతా మ్యాచుల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. అతడి స్ట్రైక్ రేటు ప్రశ్నార్థకమే. ఇక కెప్టెన్ రోహిత్ నెదర్లాండ్స్ తో మ్యాచులో మాత్రమే హాఫ్ సెంచరీ సాధించాడు. తర్వాత మంచి ఆరంభాలు వచ్చినా వాటిని భారీస్కోర్లుగా మలచలేకపోయాడు. కీలకమైన సెమీస్ లోనూ వీరిద్దరూ తీవ్రంగా నిరాశపరిచారు. 


పేస్ బౌలింగ్ లో పస ఎక్కడ?


మన పేస్ బౌలింగ్ దాడి గురించి చెప్పడానికి ఏమీ లేదు. బుమ్రా గాయంతో తప్పుకోవటంతోనే బౌలింగ్ బలం సగం బలహీనపడింది. దానికి తోడు సీనియర్ భువనేశ్వర్ పేలవ ఫామ్ తో మరింత దిగజారింది. ఆస్ట్రేలియాలోని బౌలింగ్ పిచ్ లపై పర్వాలేదనిపించే ప్రదర్శన చేసిన భువీ.. సెమీస్ లో బ్యాటింగ్ పిచ్ పై పూర్తిగా తేలిపోయాడు. ఇక మరో వెటరన్ షమీ కూడా ప్రభావం చూపలేదు. పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఒకటీ రెండు మ్యాచుల్లో తప్పితే తన మ్యాజిక్ ను చూపలేదు. అర్హదీప్ ఒక్కడే పరవాలేదనిపించే ప్రదర్శన చేశాడు. 


స్పిన్నర్ల పేలవ ప్రదర్శన


భారత స్పిన్ ద్వయం అశ్విన్, అక్షర్ ఒక్క పెద్ద మ్యాచులోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అసలు వారిద్దరి ఎంపికే బాలేదు. ఆస్ట్రేలియా పిచ్ లపై లెగ్ స్పిన్నర్లు రాణిించారు. అలాగే టీ20ల్లో మణికట్టు స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేస్తారు. మన జట్టులో ఉన్న ఏకైక రిస్ట్ అండ్ లెగ్ స్పిన్నర్ చాహల్. అయితే అతను జట్టుతోపాటే ఉన్నా ఏ ఒక్క మ్యాచులోనూ అవకాశం ఇవ్వలేదు. వరుసగా విఫలమవుతున్నా అశ్విన్, అక్షర్ పటేల్ నే కొనసాగించారు. ఆటగాళ్లపై నమ్మకముంచడం మంచిదే కానీ మరీ ఎక్కువ అవకాశాలు ఇవ్వడం మంచిదికాదు. కీలకమైన సెమీస్ లో ఇలా చేయడం వల్ల భారత్ నష్టపోయింది. అశ్విన్, అక్షర్ లు ఇంగ్లండ్ బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బందిపెట్టలేకపోయారు. 


దారుణమైన ఫీల్డింగ్


ఫీల్డింగ్ లో మిగతా జట్లతో పోలిస్తే టీమిండియా ఎప్పుడూ రెండడుగులు వెనకే ఉంటుంది. ప్రపంచకప్ లోనూ ఇది కనిపించింది. చిన్న జట్లు సైతం ఫీల్డింగ్ లో అదరగొడుతున్న వేళ.. భారత ఫీల్డర్లు మాత్రం చేతుల్లో పడిన క్యాచులను జారవిడిచారు. ఇండియా జట్టులో కోహ్లీ తప్ప మైదానంలో చురుగ్గా కదిలేవారు కనిపించడం లేదు. కోహ్లీ కూడా దక్షిణాఫ్రికాతో మ్యాచులో చేతుల్లో పడిన క్యాచును విడిచిపెట్టి విమర్శల పాలయ్యాడు. అయితే వయసు ప్రభావం కూడా భారత్ పై ఉంది. జట్టులో ఒకరిద్దరు తప్ప మిగతా వారందరూ 32 ఏళ్లు దాటినవారే ఉన్నారు. వారి నుంచి అద్భుత ఫీల్డింగ్ ఆశించడం అత్యాశే అవుతుంది. 


'కెప్టెన్' నిర్ణయాలు ఎక్కడ?


బ్యాటర్ గా విఫలమైన రోహిత్ శర్మ కెప్టెన్ గానూ నిరాశపరిచాడు. వరుస ద్వైపాక్షిక సిరీసుల్లో జట్టును విజయపథంలో నిలిపిన రోహిత్ మెగా టోర్నీలో విఫలమయ్యాడు. ఎంతో ఒత్తిడి ఉండే పెద్ద టోర్నీల్లో జట్టును నడపడం అంత తేలిక కాదు. ఈ టాస్కును హిట్ మ్యాన్ గెలవలేకపోయాడు. జట్టు ఎంపిక, ఆటగాళ్లను వాడుకునే విధానంలో పట్టు కోల్పోయాడు. పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. దీపక్ హుడా బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగలిగినా అతనికి బంతి ఇవ్వలేదు. అలాగే యుజువేంద్ర చాహల్, హర్షల్ పటేల్ లకు ఒక్క అవకాశం ఇవ్వలేదు. ఈ నిర్ణయాలు జట్టు వైఫల్యాన్ని నిర్ణయించాయి.


ఏదేమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరో ఏడాది కప్పు లేకుండానే భారత్ ఇంటికెళ్లింది. ఇప్పటికైనా జట్టు కూర్పుపై, ఆటగాళ్ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే వచ్చే ఏడాదీ ఇదే పునరావృతమవుతుంది. చేసిన తప్పులు దిద్దుకుని, మంచి జట్టును నిర్మించుకుని 2023 వన్డే ప్రపంచకప్‌లో అయినా టీమిండియా మంచి ప్రదర్శన చేస్తుందని ఆశిద్దాం.