భారత ఏస్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయానికి కోహ్లీ ఈ మైలురాయికి 42 పరుగుల దూరంలో ఉన్నాడు.
ఇదే మైదానంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేళ జయవర్ధనేను దాటి టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతోపాటు టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక అర్థ సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ నిలిచాడు. దీంతోపాటు 2014, 2016 ప్రపంచకప్‌ల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా పొందాడు.
గురువారం అడిలైడ్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో భారత్ ఓటమి చవిచూసింది. 169 పరుగులను డిఫెండ్ చేసుకోలేక తెల్లముఖం వేసింది. కనీసం ఒక్క వికెట్టైనా పడగొట్టలేక అవమానం మూటగట్టుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్ (80 నాటౌట్; 49 బంతుల్లో 9x4, 3x6), అలెక్స్ హేల్స్ (86 నాటౌట్; 47 బంతుల్లో 4x4, 7x6) టీమ్‌ఇండియా బౌలింగ్‌ను చితకబాదేశారు.
అంతకు ముందు భారత్ బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (50; 40 బంతుల్లో 4x4, 1x6), హార్దిక్ పాండ్యా (63; 33 బంతుల్లో 4x4, 5x6) రాణించారు. వీరిద్దరూ రాణించటంతో భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.