టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన భారత క్రికెట్ జట్టు మరో ఐసీసీ టోర్నీలో తడబడి లక్షలాది మంది క్రికెట్ అభిమానుల గుండెలను ముక్కలు చేసింది. ఓటమి తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ డగౌట్‌లో ఏడుస్తూ కనిపించాడు.


అడిలైడ్ ఓవల్‌లో రోహిత్ భావోద్వేగాలను టెలివిజన్ కెమెరాలు బంధించాయి. అనంతరం అతడిని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ ఓదార్చారు. చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు రోహిత్ వీడియోను షేర్ చేశారు. అందులో అతను భావోద్వేగానికి లోనవుతున్నట్లు చూడవచ్చు.


రోహిత్ కూడా మంచి స్కోర్ చేయడంలో విఫలమయ్యాడు. తను 28 బంతుల్లో 27 పరుగులు మాత్రమే చేశాడు. కేఎల్ రాహుల్ 5 బంతుల్లో 5 పరుగులతో మరోసారి నిరాశపరిచాడు. ప్రపంచ టీ20 నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా 10 బంతుల్లో 14 పరుగులు చేసి విఫలం అయ్యాడు.


గురువారం అడిలైడ్ ఓవల్‌లో 16 ఓవర్లలో 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించింది అలెక్స్ హేల్స్ 47 బంతుల్లో 86, జోస్ బట్లర్ 49 బంతుల్లో 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో ఆదివారం ఎంసీజీలో జరగనున్న ఫైనల్లో పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది.


విరాట్ కోహ్లి 40 బంతుల్లో 50, హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 63 పరుగులు చేయడంతో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మ్యాచ్ అనంతరం జరిగిన అవార్డ్ వేడుకలో భారత కెప్టెన్ మాట్లాడుతూ, తమ జట్టు ఒత్తిడిని ఎదుర్కోవడంలో విఫలమైందని, బంతితో సరిపడినంతగా రాణించలేదని చెప్పాడు.


"నాకౌట్ మ్యాచ్‌ల్లో ప్రెజర్ హ్యాండిల్ చేయడం చాలా ముఖ్యం. దీన్ని ఎవరికీ నేర్పించలేం. ఇదే కుర్రాళ్లు IPLలో ఎంతో ఒత్తిడిలో ప్లేఆఫ్‌లు ఆడారు." అని రోహిత్ శర్మ చెప్పారు. "భువీ మొదటి ఓవర్ వేసినప్పుడు అది స్వింగ్ అయింది. కానీ సరైన ఏరియాల నుండి కాదు. మేం దాన్ని టైట్‌గా ఉంచాలనుకున్నాం. ఎందుకంటే స్క్వేర్ ఆఫ్ ది వికెట్ మాకు తెలిసిన ప్రాంతం. కానీ ఈరోజు పరుగులు అక్కడే వచ్చాయి." అన్నాడు.