Wasim Jaffer:  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మరోసారి వార్తల్లో నిలిచారు. పాకిస్థాన్ మాజీ ఆటగాడు ఇమ్రాన్ నజీర్ చేసిన ట్వీట్ కు తనదైన శైలిలో కౌంటర్ వేశారు. అసలేం జరిగిందంటే...


టీ20 ప్రపంచకప్ లో భాగంగా బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ పై పాకిస్థాన్ సునాయాస విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. దీనిపై చాలామంది మాజీ క్రికెటర్లు పాక్ ను అభినందించారు. ఇమ్రాన్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, ఇయాన్ బిషప్ తదితరులు సామాజిక మాధ్యమాల ద్వారా పాక్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.  ఈరోజు జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్ పై గెలిస్తే టీమిండియా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. తమ జట్టు విజయం భారత్- పాక్ మధ్య తుది పోరుకు అవకాశం కల్పించిందని షోయబ్ అక్తర్ లాంటి వాళ్లు వ్యాఖ్యానించారు. అలా జరిగితే 2007 తర్వాత ప్రపంచకప్ ఫైనల్ లో భారత్- పాక్ తలపడినట్లవుతుంది. 


దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ వసీం జాఫర్ ను ట్యాగ్ చేస్తూ ట్విటర్ లో ఒక ఇమేజ్ ను షేర్ చేశాడు. పాక్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించిన తర్వాత అమితాబ్ బచ్చన్ ఫొటోకు గెస్ కరో కహా హై హమ్ (ఊహించండి. మనం ఎక్కడికి చేరుకున్నామో) అని క్యాప్షన్ ను జతచేసి జాఫర్ ను ట్యాగ్ చేస్తూ ట్విటర్ లో పోస్ట్ చేశాడు. దీనికి 'లాహోర్' అని ఒకే ఒక్క పదంతో జాఫర్ సమాధానం ఇచ్చాడు. దీంతో ఆ ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


పాక్ సునాయాస విజయం


మొదటి సెమీ ఫైనల్లో గెలిచిన పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.  టోర్నీలోనే అత్యుత్తమంగా ఆడిన న్యూజిలాండ్‌ను వణికించింది. సిడ్నీలో జరిగిన సెమీ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. 153 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లకే ఛేదించింది. ప్రత్యర్థికి ఏ వ్యూహాలు అమలు చేయాలో తెలియనంత వేగంగా పవర్‌ప్లే ఆడేసింది.


పాక్‌ ఓపెనర్లు బాబర్‌ ఆజామ్‌ (53; 42 బంతుల్లో 7x4), మహ్మద్‌ రిజ్వాన్‌ (57; 43 బంతుల్లో 7x4) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. అసలు సిసలు మ్యాచులో తిరుగులేని ఫామ్‌లో కనబరిచారు. కేన్‌ విలియమ్సన్‌కు వారినెలా అడ్డుకోవాలో అర్థమేకాలేదు. అంతకు ముందు కివీస్‌లో డరైల్‌ మిచెల్‌ (53*; 35 బంతుల్లో 3x4, 1x6), కేన్‌ విలియమ్సన్‌ (46; 42 బంతుల్లో 1x4, 1x6) రాణించారు. ఫైనల్లో ఇంగ్లాండ్‌, భారత్‌ మ్యాచులో విజేతతో పాక్‌ తలపడనుంది.