KL Rahul in T20 World Cups: ఐసీసీ టీ20 ప్రపంచకప్పుల్లో కేఎల్‌ రాహుల్‌ పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. టాప్‌ క్రికెటింగ్‌ జట్లపై అతడు వరుసగా విఫలమవుతున్నాడు. కనీసం రెండంకెల స్కోర్లు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అడిలైడ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సెమీస్‌లోనూ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. కేవలం ఐదు బంతులాడి ఐదు పరుగులు చేసి పెవిలియన్‌ చేరుకున్నాడు.




క్రిస్‌ వోక్స్‌ వేసిన 1.4వ బంతికి కేఎల్‌ రాహుల్‌ ఔటయ్యాడు. అదనపు బౌన్స్‌తో వచ్చిన ఈ బంతి రాహుల్‌ భుజాల మీదుగా వెళ్లింది. దీనిని ఆడేందుకు సిద్ధంగా లేకపోవడంతో కాళ్లు కదపలేకపోయాడు. దాంతో బ్యాటు అంచుకు తగిలిన బంతి నేరుగా గాల్లోకి లేచింది. దానిని జోస్‌ అందుకున్నాడు.


సాధారణ మ్యాచుల్లో విరుచుకుపడే రాహుల్‌ మెగా టోర్నీల్లో టాప్‌-8 జట్లపై విఫలమవ్వడం టీమ్‌ఇండియాను ఆందోళన పెడుతోంది. గతేడాది దుబాయ్‌లో పాకిస్థాన్‌పై 8 బంతులాడి 3 కొట్టాడు. ఇక న్యూజిలాండ్‌పై తప్పక గెలవాల్సిన పోరులో 16 బంతులాడి 18 రన్స్‌ చేశాడు. ఈ ఏడాది పాక్‌పై మెల్‌బోర్న్‌లో 8 బంతుల్లో 4 చేశాడు. పెర్త్‌లో దక్షిణాఫ్రికాపై 14 బంతుల్లో 9 కొట్టాడు. ఇప్పుడు అడిలైడ్‌లో ఇంగ్లాండ్‌పై 5 బంతుల్లో 5 చేశాడు.




టీమ్‌ఇండియాలో విరాట్‌ కోహ్లీ తర్వాత కేఎల్‌ రాహుల్‌ను అత్యంత టెక్నికల్‌ ప్లేయర్‌గా భావిస్తారు. ఒక బంతికి 3, 4 షాట్లు ఆడగల సత్తా ఉంది. సంప్రదాయ క్రికెటింగ్‌ షాట్లతో పాటు ఆధునిక షాట్లూ బాదేస్తాడు. అయితే అతడి మైండ్‌ సెట్‌లో కొన్ని లోపాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్‌స్వింగర్లు, బౌన్సర్లు వస్తున్నప్పుడు స్పష్టమైన మనస్తత్వంతో ఆడటం లేదు. గందరగోళానికి గురై వికెట్‌ ఇచ్చేస్తున్నాడు. అదనపు బౌన్స్‌, స్వింగ్‌ అవుతున్న పిచ్‌లపైనా అతడు ఇబ్బంది పడుతున్నాడు.