Bus Conductor Ticketed to Sheep in Rtc Bus: తెలంగాణలో మహా కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. వన దేవతలను దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో తమ వెంట గొర్రెలు, మేకలను సైతం తీసుకెళ్తుండగా.. వాటిని ఆర్టీసీ బస్సుల్లో అనుమతించడం లేదు. దీంతో కొన్ని చోట్ల భక్తులు అధికారులు, ఆర్టీసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇదిలా ఉండగా.. మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మేడారం జాతరకు తీసుకెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో గొర్రె పోతులను ఎక్కించాడు. అయితే, కండక్టర్ సైతం వాటికి టికెట్ కొట్టారు. కాగా, గొర్రెలతో ఇతర ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. బస్సులోని ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. మరోవైపు, మేడారం వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలను అనుమతించమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. భక్తులు వీటిని ప్రైవేట్ వాహనాల్లోనే తీసుకెళ్లాలని సూచించారు.  అయితే, మూగజీవాలకు బస్సుల్లో ఎంట్రీ లేకపోయినా కొన్ని చోట్ల ప్రజలు వినకుండా వాటిని బస్సుల్లో తీసుకెళ్తున్నారు.


సిబ్బందితో భక్తుల వాగ్వాదం


అటు, జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లాలోని స్థానిక బస్టాండులో నాచారం గ్రామానికి చెందిన కొందరు భక్తులు కుటుంబ సభ్యులతో మేడారం జాతరకు వెళ్తూ.. తమతో పాటు గొర్రె పిల్లలను తీసుకొచ్చారు. దీంతో వారిని అడ్డుకున్న అధికారులు మూగజీవాలను అనుమతించమని స్పష్టం చేశారు. కావాలంటే వాటికి టికెట్ తీసుకోవాలని భక్తులు కోరినా.. ఆర్టీసీ సిబ్బంది ససేమిరా అనడంతో వారితో వాగ్వాదానికి దిగారు. ప్రతి ఏటా మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి ఆర్టీసీ బస్సుల్లోనే గొర్రెలతో వెళ్లే వారమని ప్రయాణికులు తెలిపారు. ఇప్పుడు ఇలాంటి పద్ధతి తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారికి.. ఆర్టీసీ సిబ్బంది, పోలీసులు సద్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.


పెరిగిన ధరలు


మేడారం జాతర సందర్భంగా గొర్రెలు, మేకల ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణంగా భక్తులు అమ్మవార్లకు ఎక్కువగా మేకలనే మొక్కులుగా చెల్లిస్తారు. వాటికి డిమాండ్ పెరగడంతో లభించడం కష్టంగా మారి గొర్రెలను మొక్కులుగా చెల్లిస్తున్నారు. అటు మేడారంలోనే కాక.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వందకు పైగా సమ్మక్క, సారక్క అనుబంధ జాతరలు జరుగుతుంటాయి. మేడారానికి వెళ్లని భక్తులు.. చుట్టుపక్కల మొక్కులు చెల్లించుకుంటుంటారు. మొన్నటి వరకూ 8 నుంచి 10 కిలోల బరువున్న మేక ధర రూ.12 వేలు ఉండేది. ఇప్పుడు అమాంతం రూ.5 వేలకు పైగా ధరలు పెరిగిపోయాయి. అలాగే, తక్కువ బరువున్న మేకల ధరలను రూ.3 వేలకు పైగా పెంచేశారు. ధరలు పెంచినా అవి అందుబాటులో లేక మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, ధర పెరిగినా పెద్ద సైజులో ఉన్న మేకలు, గొర్రెలను కొనేందుకే భక్తులు ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. 


Also Read: Hyderabad News: జస్ట్ మిస్ - డ్రైవర్ అప్రమత్తతతో మహిళకు తప్పిన ప్రమాదం, లేకుంటే?