Telangana Rajya Sabha Candidates is Unanimous: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రం ముగిసింది. రాష్ట్రంలో 3 స్థానాలకు కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఒకరు బరిలో నిలవగా.. ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే శ్రమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ లు నామినేషన్లు ఇచ్చారు. అయితే, రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఒక్కో అభ్యర్థికి కనీసం 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు మినహా మిగిలిన ముగ్గురికీ మద్దతుగా ఎమ్మెల్యేలెవరూ సంతకాలు చేయలేదు. ఈ క్రమంలో ఆ ముగ్గురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు.
ఫైర్ బ్రాండ్@ రేణుకా చౌదరి
రేణుకాచౌదరి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందారు. 1984లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. 1986లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్ గా గెలిచారు. 1986 నుంచి 98 వరకూ రెండుసార్లు రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. 1999, 2004లో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. హెచ్ డీ దేవెగౌడ ప్రభుత్వంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 2004లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, 2006 నుంచి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ నుంచి పోటీ చేసి నామా నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు.
యువ నాయకుడిగా అనిల్ గుర్తింపు
సికింద్రాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు యత్నించారు. అయితే, పార్టీలో వన్ ఫ్యామిలీ.. వన్ టికెట్ ఫార్ములా అమలుతో ఆ సీటును తండ్రి కోసం త్యాగం చేశారు. యూత్ కాంగ్రెస్ లో చురుగ్గా పని చేసి మంచి గుర్తింపు పొందడంతో రాజ్యసభ ఛాన్స్ దక్కింది.
వద్దిరాజుకు రెండో ఛాన్స్
గతంలో బండ ప్రకాష్ రాజీనామా వల్ల ఖాళీ అయిన రాజ్యసభ సీటును వద్దిరాజుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చారు. 2022, మే 24న ఈ పదవికి ఎన్నికైన వద్దిరాజు కేవలం రెండేళ్లే ఎంపీగా కొనసాగడంతో ఆయనకు మరోసారి గులాబీ బాస్ అవకాశం కల్పించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరారు.