Himachal predesh rains: ఉత్తరభారత దేశాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఊళ్లు, నదులు ఏకమైపోతున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. చాలా ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, ఛండీగడ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విధ్వంసం కొనసాగింది. 72 గంటలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు సుమారు 42 మంది మృతి చెందారు. ఈ వరదలు, వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌ అత్యంత తీవ్రంగా దెబ్బతింది. ఈ రాష్ట్రంలో మృతుల సంఖ్య 20 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 4000 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. పరిస్థితి చక్కబడిన తర్వాత క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్లి పూర్తి నష్టాన్ని అంచనా వేయనున్నారు. 


మనాలీలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు...


మనాలి-లేహ్ జాతీయ రహదారిలో కొంత భాగం కుంగిపోయింది. దీంతో  లాహౌల్-స్పితి జిల్లా, లడఖ్‌కు కనెక్టివిటీ తెగిపోయింది. లాహౌల్-స్పితి, కులు జిల్లాల్లో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది పర్యాటకులు, స్థానిక ప్రజలను హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చంబా జిల్లాలోని భర్మౌర్ ప్రాంతంలోని మణిమహేష్ సరస్సు వద్దకు వెళుతున్న సుమారు 70 మంది పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు. అయితే కులు, మ‌నాలీలో చిక్కుకున్న పర్యాటకుల్లో తెలుగు విద్యార్థులు ఉన్నారు. అక్క‌డ తెలంగాణకు చెందిన విద్యార్థులు చిక్కుకున్న‌ట్లు త‌మ‌కు స‌మాచారం అందిందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఈ విష‌యాన్ని వెల్లడించారు. ఆ విద్యార్ధుల‌కు చెందిన పేరెంట్స్ ఈ స‌మాచారాన్ని షేర్ చేసిన‌ట్లు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అయితే విద్యార్థుల‌ను క్షేమంగా తీసుకువ‌చ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ క‌మిష‌న‌ర్‌ను అల‌ర్ట్ చేశామ‌న్నారు. సహాయం కోసం బాధితులు ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌ను లేదా త‌మ‌ ఆఫీసును సంప్ర‌దించ‌గ‌ల‌ర‌ని మంత్రి పేర్కొన్నారు. 


&nbsp





పరిస్థితి కుదుట పడే ఛాన్స్..


ఎక్కువ నష్టం జరిగిన హిమాచల్‌ప్రదేశ్‌లో పరిస్థితి కుదట పడే ఛాన్స్ కనిపిస్తోందని ఐఎండీ ప్రకటించింది. అంతేకాకుండా రెడ్‌ అలర్ట్‌ను ఉపసంహరించుకుని..ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ సాయంత్రం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఎలక్ట్రిక్ సబ్-స్టేషన్లు, అనేక నీటి సరఫరా వ్యవస్థ ధ్వంసమైంది. మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటి వరకు 4,686 ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోయాయని. దీంతో వందల గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. మరోవైపు సోలన్ జిల్లాలోని పర్వానూ అనే పర్యాటక ప్రదేశంలో కార్లు నీటిలో కొట్టుకుపోతున్న విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. బాల్కనీలో ఉన్న వ్యక్తులు గట్టిగా కేకలు వేస్తూ ఆ విజువల్స్ క్యాప్చర్ చేశారు.