కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామం సంసద్ యోజన కార్యక్రమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వెన్నంపల్లి గ్రామంలో స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, నర్సరీ ఉన్నాయి. హరితహారంలో భాగంగా రోడ్డుకిరువైపులా చెట్లు నాటారు. తడి చెత్త-పొడి చెత్త వేరు చేసేందుకు చెత్త బుట్టలు పంపిణీ, స్ట్రీట్ లైట్స్, సీసీ రోడ్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రామస్థుల ఆర్థిక సహకారంతో సబ్ స్టేషన్ నిర్మాణం లాంటి అభివృద్ధి పనులతో ముందుకు సాగారు. దీంతో సంసద్ యోజన పథకంలో భాగంగా ఉత్తమ గ్రామంగా ఎంపికైనట్లు సర్పంచ్ అబ్బిడి పద్మ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, శాసనసభ్యులు సతీష్ కుమార్ జిల్లా వైస్ చైర్మన్ గోపాల్ రావు, ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని సర్పంచ్ పద్మ పేర్కొన్నారు. 



తెలంగాణలో నుంచి 7 గ్రామాలు 


సంసద్ ఆదర్శ్ గ్రామాలలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన(SAGY) జాబితాలో టాప్ టెన్ లో ఏడు గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి ఉన్నాయి. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కార్యక్రమంలో భాగంగా దేశంలోని గ్రామాల్లో సామాజిక అభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి, గ్రామ సంఘాల ఐక్యత, సామాజిక సమీకరణపై సహా పలు అభివృద్ధి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇటీవల ప్రకటించిన జాబితాలో మొదటి పది స్థానాల్లో ఏడు తెలంగాణ గ్రామాలకు చోటు దక్కింది. ఆదర్శ గ్రామాల జాబితాలో కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి గ్రామం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌ గ్రామం, 4వ స్థానంలో కరీంనగర్‌ జిల్లా బెజ్జంకి మండలంలోని గన్నేరువరం, 5వ స్థానంలో నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలంలోని కందకుర్తి, 6వ స్థానంలో కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వీర్నపల్లి, 9వ స్థానంలో వీణవంక మండలంలోని రామకృష్ణాపూర్‌, 10వ స్థానంలో నిజామాబాద్‌ జిల్లాలోని తాణాకుర్ద్‌ గ్రామాలు నిలిచాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మొత్తం 5 గ్రామాలు ఈ జాబితాలో స్థానం సంపాదించాయి. నిజామాబాద్ జిల్లాలో 3 గ్రామాలు ఉన్నాయి. 


మంత్రి కేటీఆర్ అభినందనలు


పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులు గ్రామాల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ప‌థ‌కం అమ‌లుతో తెలంగాణ గ్రామాలు దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తున్నాయన్నారు. సంస‌ద్ ఆద‌ర్శ్ గ్రామ యోజ‌న జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. టాప్ టెన్ ర్యాంకుల్లో తెలంగాణ గ్రామాలు ఏడు ర్యాంకుల‌ను కైవ‌సం చేసుకున్నాయన్నారు. దేశంలోని తొలి ఆద‌ర్శ గ్రామంగా ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని వెన్నంపల్లి గ్రామం నిలిచిందని, అందుకు ఆ గ్రామ పాలకమండలి, పంచాయతీరాజ్ శాఖ మత్రి ఎర్రబెల్లి దయాకర్ కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.