తిరుమలలోని అంజనాద్రిలో హనుమాన్ జన్మస్ధలానికి ఈ నెల‌16వ భూమి పూజ నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. మాఘ పౌర్ణమి నాడు పూజా కార్యక్రమంతో ప్రక్రియ చేయబోతున్నట్టు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ప్రకటించారు.  


టిటిడి ఈవో జవహర్ రెడ్డి, అధికారులతో భూమి పూజ నిర్వ‌హించే కలిసి ఆకాశ‌గంగ ప‌రిస‌రాల్లో ప్రాంతాన్ని ప‌రిశీలించారు. అక్కడ చేయాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. గోగ‌ర్భం డ్యాం, రింగ్ రోడ్డు ప‌రిస‌రాల‌లో నూత‌నంగా అభివృద్ధి చేసిన కూడ‌ళ్ళ‌ను, త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నాన్ని కూడా చూశారు. 


తిరుమల ఆకాశ గంగ సమీపంలోనే అంజనాద్రి శ్రీ ఆంజనేయ‌ స్వామి జన్మస్థల‌మ‌ని భౌగోళిక, పౌరాణిక‌, శాస్త్రీయంగా ఆధారాలతో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్రకటించింది. ఆ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి, సుందరీకరణ చేపట్టేందుకు టీటీడీ నిర్ణయించింది. అందులో భాగంగా ఫిబ్రవరి 16న భూమిపూజ చేస్తున్నారు. 






భూమి పూజ నిర్వహించే రోజునే హ‌నుమంతుని జ‌న్మ‌వృత్తాంతంపై పుస్త‌కాన్ని కూడా విడుదల చేయబోతున్నట్టు టీటీడీ ఈవో ప్రకటించారు. అంజ‌నాదేవి, బాల ఆంజ‌నేయ‌ స్వామి ఆల‌యం ఎదురుగా ముఖ మండ‌పం, గోపురాలు, గోగ‌ర్భం డ్యాం వ‌ద్ద రోట‌రీ దాత‌ల స‌హ‌కారంతో ఏర్పాటు చేస్తామ‌న్నారు. 


విశాఖ శారద పీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతీ స్వామి, అయోధ్య రామ‌జ‌న్మ భూమి ఆల‌య నిర్మాణ ట్ర‌స్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్‌, చిత్రకూట్ పీఠాధిపతి రామభద్రా చార్యులు, కోటేశ్వ‌ర‌ శ‌ర్మ‌ ఈ పూజా కార్యక్రమానికి రానున్నారు.  


తిరుమ‌ల‌లోని త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నంలో ఉన్న 1.5 ఎక‌రాల స్థ‌లం అభివృద్ధి చేయాల‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యించింద‌న్నారు జవహర్‌రెడ్డి. ఇక్క‌డ ధ్యాన‌మందిరం, ఉద్యాన‌వ‌నం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో ఇందుకు సంబంధించి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించి, బృందావ‌నం అభివృద్ధి ప‌నులు ప్రారంభించ‌నున్న‌ట్లు టిటిడి ఈవో తెలియజేశారు. 


ఆంజేయుడి జన్మస్థలంపై చాలా వివాదాలు నడిచాయి.  కర్ణాటకలోని అంజనాద్రిలో హనుమాన్ జన్మించాడంటూ ఓ వర్గం వాదనకు దిగింది. సరైన ఆధారాలతో వస్తే కచ్చితంగా చర్చిస్తామంటూ టీటీడీ వాళ్లకు సవాల్ చేసింది. తాము శాస్త్రియంగానే హనుమంతుడి జన్మస్థలంపై నిర్దారణకు వచ్చామని ఇందులో ఇంకో మాటకు తావులేదంటూ టీటీడీ చెబుతోంది. దీనిపై ఇంకా వివాదం కొనసాగించడం ఇష్టం లేక ఆంజనేయుడు జన్మించాడని భావిస్తున్న ప్రాంతంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతోంది. విమర్శకులకు చెక్‌ పెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.