ఆంధ్రప్రదేశ్ సినిమా టిక్కెట్ల వివాదానికి పదో తేదీన ముగింపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో  సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సమావేశం అయ్యారు. సినిమా టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరలపై సమావేశంలో చర్చ జరిపారు. నిమా టికెట్ల ధరల పెంపు అంశంపై  ప్రభుత్వం నియమించిన కమిటీ చేసిన అధ్యయనంపై చర్చించారు. ఈ కమిటీని నివేదికను దాదాపుగా సిద్ధం చేసింది. సినిమా టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరలు,  థియేటర్ల యజమానుల సమస్య పరిష్కారంపైనా ఈ కమిటీ సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం పరిశీలన తర్వాత నివేదికపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో చిరంజీవి నేతృత్వంలో రానున్న టాలీవుడ్ బృందంతో చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయాన్ని సీఎం ప్రకటించే అవకాశం ఉంది. 


గత ఏడాది ఏప్రిల్‌లో హఠాత్తుగా ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులూ జారీ చేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ విడుదలయింది.  బెనిఫిట్ షోలు రద్దు చేయడం, టిక్కెట్ రేట్లను తగ్గించడం ఆ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించింది. ఆ తర్వాత కరోనా పరిస్థితులు విజృంభించడంతో సినిమాల విడుదలలన్నీ వాయిదా పడ్డాయి. మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడే సరికి టిక్కెట్ రేట్ల వివాదం అంతకంతకూ పెరిగి పెద్దయింది. 


టాలీవుడ్‌కు చెందిన వారు పలుమార్లు  ఏపీ ప్రభుత్వ పెద్దలతో సమావేశం అయినా అనుకూల నిర్ణయాలు రాలేదు. దీంతో కొంత మంది ఎగ్జిబిటర్లు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కమిటీ నియమించింది. ఆ కమిటీ ఇప్పటికీ మూడు సార్లు సమావేశమయింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లుతో పాటు ప్రేక్షుకుల సంఘం తరపున పలువురు హాజరై టిక్కెట్ రేట్లపై తమ అభిప్రాయాలను చెప్పారు. రెండో తేదీన జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ.. మరో సమావేశం తర్వాత సమస్య పరిష్కారం అవుతుందని కొంత మందిసభ్యులు చెప్పారు. అయితే మరో సమావేశం అవసరం లేకుండానే కమిటీ నివేదిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. 
 
సినిమా టిక్కెట్ల అంశంపై ఫిబ్రవరి పదో తేదీన ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. అదే రోజున టాలీవుడ్‌కు చెందిన బృందం సీఎం జగన్‌ను కలవనుంది. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలను టాలీవుడ్‌కు చెందిన వివిధ వ్యాపారవర్గాలతో చిరంజీవి చర్చించాలనుకుని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ అవి ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నాయి. దీంతో చిరంజీవితో కలిసి జనగ్ వద్దకు వెళ్లే వారెవరు అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.