మారుతున్న టెక్నాలజీ లైఫ్‌స్టైల్‌నే కాదు ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. కొత్తగా వస్తున్న టెక్నాలజీ కొత్త అవకాశాలకు మార్గాలు చూపిస్తోంది. దీనిపై అవగాహన లేకుండా ముందుకెళ్తే అంతా శూన్యమే. భవిష్యత్ గందరగోళంగా మారుతుంది. 


అందుకే ఇవాళ వచ్చిన టెక్నాలజీని తెలుసుకొని రేపు రాబోయే కొత్త అప్‌డేట్స్ తెలుసుకున్నప్పుడే భవిష్యత్‌ బాగుటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ అంశంపై ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. చాలామంది మిలినియల్స్ ఈ మార్గాన్నే అనుసరిస్తున్నారు. ఈ శాతం ఇంకా పెరిగినప్పుడే యువతరానికి ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయి. 


విద్యార్థుల ఆలోచన న్యూ కెరీర్‌ వైపు మారాలంటే ముందుగా వాళ్ల బాగోగులు చూసుకునే వాళ్ల మైండ్‌ సెట్ మారాలి. లేటెస్ట్ ట్రెండ్‌ వాళ్లకు తెలిస్తేనే తమ బిడ్డలను ఆ దిశగా నడిపించగలరు లేకుంటే సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటారు. 


ఏం అవుదామని అనుకుంటున్నావని అడిగితే చాలు డాక్టర్, లాయర్, ఇంజినీరింగ్, టీచర్, లేదా ప్రభుత్వ ఉద్యోగం ఇదే సమాధానం వినిపిస్తుంది. 


ఎందుకు అంటే అందులోనే చాలా ఆనందం ఉందని... వేరే జాబ్స్‌లో అంతటి కంఫర్ట్‌బుల్ ఉండదని చెప్తారు. కానీ అలాంటి ఆనందాన్ని ఇచ్చే చాలా నేటితరం మెచ్చే చాలా కోర్సులు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. డెవలప్‌ అవుతున్న టెక్నాలజీ ఈ విషయాన్ని ఇప్పటికే ప్రూవ్ చేసింది. 


ఇక్కడ చెప్పే పది అద్భుతమైన రంగాల్లో కచ్చితంగా ఏవైనా రెండు మీ ఆలోచనలను మార్చేస్తాయి. 


1. డేటా సైంటిస్ట్


విభిన్న ప్రోగ్రామింగ్ లెంగ్వేజ్‌లు, మ్యాథ్‌మేటిక్స్‌, అండ్‌ స్టాటస్టిక్స్‌ను ఉపయోగించి డేటా సైంటిస్ట్‌లు పెద్దమొత్తంలో డేటాను క్యూరేట్ చేస్తారు. ఇలాంటి అర్థం కాని డేటాను అర్థమయ్యేలా చేసుకొని.. పనులను సజావుగా సాగేలా చూసుకోవడానికి పెద్ద సంస్థలు, కంపెనీలు డేటాసైంటిస్టులను నియమించుకుంటాయి. వాటిని విశ్లేషించడం, నిర్వహించడం వాళ్ల పని.  


2. UI/UX డిజైనర్


ఇప్పుడు వ్యాపారమంతా డిజిటలైజేషన్ అయిపోయింది. ఈ డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ వరల్డ్‌లో అప్లికేషన్స్‌, వెబ్‌సైట్స్‌ చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి.  అలాంటి వాటిలో UI/UX డిజైనింగ్ అనేది అత్యంత ఆదరణ ఉన్న కోర్సు. 


మెబైల్ వినియోగదారుల కోసం యూజర్‌ ఫ్రీ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే UI/UX డిజైనర్ పాత్ర కీలకం. వాళ్లు ఇచ్చే ఇంటర్‌ఫేస్‌తోనే అప్లికేషన్ రన్ అవుతుంది. 


గ్రాఫిక్ డిజైనింగ్ మరియు డిజైనింగ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో పాటు, ఈ కెరీర్‌ను అడాప్ట్ చేసుకోవడానికి అవసరమైన ఉత్సాహం, లైఫ్‌స్టైల్‌లో వస్తున్నా మార్పులు గమనించే తత్వం, విజువల్ కమ్యూనికేషన్‌లో నైపుణ్యం ఉండాలి. 


3. డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు


ప్రపంచ వాణిజ్యంలో చాలా వరకు డిజిటలైజేషన్ అయిపోయింది. అందుకే ఆన్‌లైన్‌లో మార్కెటింగ్‌లో నైపుణ్యం ఉన్న వాళ్లకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆన్‌లైన్ మార్కెటింగ్ క్యాంపయిన్స్‌ చేస్తూ సోషల్ మీడియాలో సంస్థల ఎంగేజ్‌మెంట్స్‌ పెంచాలి. దీని ఫలితంగా ప్రపంచంలోని ఏ ప్రాంతంలోని వారైనా కంపెనీ ఉత్పత్తుల పట్ల ఆకర్షితులయ్యే ఛాన్స్ ఉంది. 


SEO,బ్లాగింగ్, కంటెంట్ మార్కెటింగ్ మొదలైనవన్నీ డిజిటల్ మార్కెటింగ్ ప్రచారానికి సంబంధించిన విభాగాలే. 


4. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్/యూట్యూబర్ 


సోషల్ మీడియాను ప్రభావితం చేయడం అనేది కొత్తగా కనిపిస్తున్న కెరీర్ ఆఫ్షన్. సోషల్ మీడియా  అంటే ఇష్టం ఉన్నవాళ్లు, దమ్మున్న కంటెంట్ క్రియేట్ చేసే సత్తా ఉన్న వాళ్లు, తనకు తానే బాస్‌గా ఉండాలనుకునేవాళ్లకు ఇది బెస్ట్‌ కెరీర్‌గా చెప్పవచ్చు. 


సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే తమ సోషల్ మీడియా హ్యాండిల్స్, బ్లాగ్‌ల ద్వారా కంపెనీలకు ప్రచారం చేసే వ్యక్తులు.  కంపెనీలు తమ ఉత్పత్తుల అమ్మకాలు, వినియోగాన్ని పెంచుకోవడానికి, సమీక్షలు, ప్రకటనలను అందించడానికి  సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు కొంత డబ్బు చెల్లిస్తుంది. 


5. బ్లాక్‌చెయిన్ ఇంజనీర్


IT రంగంలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ప్రభావం పెరుగుతోంది. అందుకే బ్లాక్‌చెయిన్ ఇంజనీర్ల కోసం డిమాండ్ కూడా వేగంగా పెరుగుతోంది, అందుకే భవిష్యత్ ఉన్న కెరీర్‌లలో ఇది కూడా చేరింది. 


6. సోషల్ మీడియా మేనేజర్


కొత్తగా ఉనికిలోకి వచ్చిన కెరీర్స్‌లో సోషల్ మీడియా మేనేజర్స్‌ కూడా ఒకటి. వ్యాపారాలు, ప్రముఖ సంస్థల కోసం పని చేస్తారు. నెటిజన్ల అటెన్షన్‌ను సంస్థలవైపు తిప్పుకోవడం ఎంగేజ్‌మెంట్‌ని పెంచడానికి, నిర్దిష్ట వ్యవధిలో వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రజాదరణ పొందేందుకు ప్రయత్నిస్తారు. దీని కోసం  సోషల్ మీడియా క్యాంపెయిన్ ప్లాన్ అమలు చేస్తారు.


మీరు ఆకట్టుకునేలా రాయగలిగితే, ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఎలా పని చేస్తాయనే అవగాన ఉంటే ఈ ఉద్యోగం మీకు సరిపోతుంది.


7. ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ మేనేజర్


మీరు తరచుగా వెబ్‌సైట్‌లు, వెబ్‌పేజీలు, యూట్యూబ్ వీడియోల మధ్య గూగుల్ సెర్చ్ పేజీలలో కంపెనీల ప్రకటనలు చూస్తుంటారు కదా అదే అడ్వర్టైజింగ్ మేనేజర్ పని. ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ మేనేజర్‌లు వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం వ్యాపార డిజిటల్ ప్రకటనలు రూపొందిస్తారు. 


నెటిజన్లను ఆకట్టుకోవడానికి, కంపెనీ కోసం ఆకర్షణీయమైన ప్రకటనలు రూపొందిస్తుంటారు.  డిజిటల్ మార్కెటింగ్ బృందంతో కలిసి పని చేస్తారు.


ఈ కొత్త కెరీర్‌లో సెటిల్ అవ్వాలంటే సేల్స్,  మార్కెటింగ్‌తోపాటు గూగుల్, డిజిటల్ అడ్వర్టైజింగ్‌పై అవగాహన తప్పనిసరి.


8. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్ట్


AI శాస్త్రవేత్తలు మానవుల పనులను సులభతరం చేయడానికి, మనిషి ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సాఫ్ట్‌వేర్,  ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేస్తారు. నిపుణులు డేటాను సేకరించడానికి, అల్గారిథమ్‌లు,  పరికరాలను రూపొందించడానికి హైటెక్ సిస్టమ్‌లతో పని చేస్తారు. మెషిన్ లెర్నింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన వినూత్న గాడ్జెట్‌లు,  సాఫ్ట్‌వేర్‌లను కనిపెడతారు. ఇవి ఇప్పుడు ప్రతి రంగంలో కూడా అత్యవసరమైపోయాయి. 


9. ప్రొఫెషనల్ గేమర్స్


ఈ రోజు బాగా ప్రాచుర్యం పొందిన మరో కొత్త కెరీర్ గేమర్. వినియోగదారు  అనుభవం,  బగ్‌లు, వేగం, నాణ్యత తెలుసుకునేందుకు గేమ్‌లను పరీక్షించడానికి కంపెనీలు తరచుగా గేమర్‌లను నియమించుకుంటాయి. గేమ్‌లోని అన్నిలెవల్స్ కంప్లీట్ చేసి వీడియో గేమ్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను గుర్తించి  వివరణాత్మక నివేదిక ఇవ్వడానికి సంస్థలు గేమర్‌లను నియమించుకొని వేతనాలు ఇస్తుంది. 


వర్చువల్ రియాలిటీ, వీడియో గేమ్‌లు,  కన్సోల్‌లకు జనాదరణ పెరుగుతున్న ఈ పరిస్థితిలో ఈ కెరీర్‌కు కచ్చితంగా భవిష్యత్ ఉంటుంది. 


10. ఫుడ్ స్టైలిస్ట్


క్రియేటివిటీ ఉన్న వ్యక్తులకు సరిగ్గా సరిపోయే రంగం. ఆఫ్-బీట్, న్యూ ఏజ్ కెరీర్ ఇది. ప్రకటనల కోసం ఫుడ్‌ రెడీ చేయడం దాన్ని విజువలైజ్ చేయడం వీళ్ల పని.  మార్కెటింగ్ ప్రచారం కోసం ఆకట్టుకునే అందమైన ఫొటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్‌లతో కలిసి పని చేస్తారు.


ఫొటోగ్రఫీ, ఫుడ్ ప్రిపరేషన్,  హోటల్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికేషన్‌లపై అవగాహన ఉంటే విజయవంతమైన ఫుడ్ స్టైలిస్ట్‌గా మీరు మారగలరు. 


గమనిక: ఇది అవగాహన కోసం ఇస్తున్న కోర్సులు మాత్రమే దీనిపై నిపుణులతో సంప్రదించి లోటుపాట్లు తెలుసుకొని మీ కెరీర్‌ను ఎంచుకోండి.