అసలే పండుగ సమయం. సెలవులిచ్చేశారు. ఎప్పుడెప్పుడు సొంతూరికి వెళ్లి సెలబ్రేట్ చేసుకుందామా అని అంతా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో పట్టణాలు వదిలి పల్లెల బాట పడుతున్నారు. అయితే, పండుగల వేళ ఇళ్లల్లో దొంగతనాలకూ ఎక్కువ ఆస్కారం ఉంది. ఖాళీగా ఉన్న ఇళ్లే టార్గెట్ గా కొందరు కేటుగాళ్లు మాటు వేసి మొత్తం దోచుకోవచ్చు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


పండుగల వేళ ఇళ్లల్లో చోరీల నివారణకు తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 'దసరా' పండుగ సందర్భంగా ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బును బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. ఊరు వెళ్తున్న విషయాలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యొద్దని, ఇంటి లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి



  • సెలవుల్లో వేరే ఊరికి వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టం ఉన్న కీ అమర్చుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

  • ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చి వెళ్లాలి. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు అనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి.

  • బైక్స్ ఇంటి ఆవరణలోనే పార్క్ చెయ్యాలి. వీలైతే వాహన చక్రాలకు చైన్ తో లాక్ చెయ్యడం మంచిది.

  • ఇంటి లోపల, బయట సీసీ కెమెరాలను అమర్చుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో చెక్ చేసుకోవాలి. ఇంటి లోపల రహస్య ప్రదేశాల్లో మాత్రమే వీటిని అమర్చాలి.

  • నమ్మకమైన వారిని మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవాలి.

  • పండుగకు ఊరు వెళ్తే రోజు వారీ పేపర్, పాల ప్యాకెట్లు వేయకుండా చూడాలి. వాటిని గమనించి కూడా చోరీలకు పాల్పడే అవకాశం ఉంది.

  • ఊరికి వెళ్లేటప్పుడు పొరుగు వారిని ఇంటిని గమనిస్తూ ఉండాలని చెప్పి వెళ్లడం ఉత్తమం. కాలనీల్లో చోరీల నివారణకు స్థానిక కుటుంబాలు స్వచ్ఛందంగా కమిటీలు వేసుకోవాలి.

  • ముఖ్యమైన తాళాలు రెగ్యులర్ ప్రదేశాల్లో కాకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశాల్లో ఉంచడం మంచిది. మీకు ఎవరి మీదైనా అనుమానం వస్తే 100 టోల్ ఫ్రీ నెంబర్ లేదా సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూం: 9490617100 లేదా వాట్సాప్ నెంబర్: 9490617444కు తెలియజేయాలని సూచించారు.


Also Read: రెండు బైకులు ఢీకొని, ఒకరు మృతి నలుగురికి గాయాలు