Nawaz Sharif in Pakistan:


పాకిస్థాన్‌కి నవాజ్ షరీఫ్..


పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) దాదాపు నాలుగేళ్ల తరవాత పాక్‌కి వచ్చారు. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నవాజ్ మళ్లీ పాక్‌లో అడుగు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఆర్థికంగా, రాజకీయంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది దాయాది దేశం. వచ్చే ఏడాది జనవరిలో పాక్‌లో ఎన్నికలు జరగనున్నాయి. నవాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని రేస్‌లో ఉంటారన్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ రేసులో ఉండాల్సిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతానికి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అంటే...వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి రేసులో నవాజ్ షరీఫ్ మాత్రమే ఉండే అవకాశాలున్నాయి. చాలా కాలంగా దుబాయ్‌లో గడుపుతున్నారు నవాజ్. అక్కడి నుంచి ఇస్లామాబాద్‌కి వచ్చి మళ్లీ అక్కడి నుంచి లాహోర్‌కి చేరుకున్నారు. అక్కడ ఆయన మద్దతుదారులంతా భారీ ఎత్తున ర్యాలీకి ప్లాన్ చేశారు. ఆయన పాక్‌కి వస్తే మళ్లీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (Pakistan Muslim League N) పార్టీ యాక్టివ్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. అంతే కాదు. ప్రాంతీయతను ఉపయోగించుకుని మరోసారి ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది కొందరి వాదన. అయితే...ప్రస్తుతానికి ఆయనపై కేసులున్నాయి. జైలుశిక్ష పూర్తిగా అనుభవించకుండానే బెయిల్‌పై బయటకు వచ్చారు. 


పాక్ తలరాత మార్చేస్తారా..? 


ఇస్లామాబాద్ హైకోర్టు ( Islamabad High Court) షరీఫ్‌కి ప్రొటెక్టివ్ బెయిల్ ఇచ్చింది. అందుకే వెంటనే పాకిస్థాన్‌లో ల్యాండ్ అవుతున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ కీలక ప్రకటన చేసింది. "అందరూ వేడుకలు చేసుకోవాల్సిన సమయమిది. ఆయన రాకతో పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతుందని విశ్వసిస్తున్నాం" అని వెల్లడించింది. నవాజ్ షరీఫ్‌ పాకిస్థాన్‌కి మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం వల్ల ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అంతే కాదు. రాజకీయాల్లో ఉండకుండా అనర్హతా వేటు వేశారు. ఏడేళ్ల జైలు శిక్ష పడినప్పటికీ ఏడాదిలోగానే బయటకు వచ్చారు. యూకేలో మెడికల్ పేరుతో కోర్టు ఉత్తర్వులనూ పక్కన పెట్టి విడుదలయ్యారు. గతేడాది నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ హయాంలోనే కొన్ని కీలక మార్పులు చేశారు. రాజకీయ నాయకుల అనర్హతా వేటు గడువుని తగ్గించారు. ఏడేళ్ల గడువుని ఐదేళ్లకి తగ్గించారు.  


భారత్ ఓ వైపు చంద్రుడిని చేరుకుంటే, మరోవైపు పాకిస్తాన్ ప్రపంచం ముందు అడుక్కుతింటోందని ఇటీవలే నవాజ్ షరీఫ్ అన్నారు. భారత్ G20 సమ్మిట్‌ని నిర్వహించిందని, ప్రస్తుతం భారత్‌లో 600 బిలియన్ డాలర్ల ట్రెజరీ ఉందని అన్నారు. అదే సమయంలో పాకిస్తాన్.. చైనా, అరబ్ దేశాలు సహా ప్రపంచం నలుమూలల నుంచి 1-1 బిలియన్ డాలర్లను యాచిస్తోందని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో వారి ముందు మనం ఏం తలెత్తుకోగలమని అన్నట్లుగా పాకిస్తాన్ మీడియా కథనాలు రాసింది. నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌కు ఈ స్థితికి రావడానికి కారణమైన వారు దేశంలోని అతిపెద్ద నేరస్థులు. పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (పిడిఎం) ప్రభుత్వం దేశాన్ని డిఫాల్ట్ నుంచి రక్షించింది. లేదంటే దేశంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.వెయ్యికి చేరుకునేది. దేశం ప్రస్తుత ఈ పరిస్థితికి రిటైర్డ్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ మాజీ చీఫ్ ఫైజ్ హమీద్, మాజీ చీఫ్ జస్టిస్ మియాన్ సాకిబ్ నిసార్ బాధ్యులు’’ అని నవాజ్ షరీఫ్ ఆరోపించారు.


Also Read: Gaganyaan Mission: గగన్‌యాన్ కోసం ఎంత ఖర్చవుతుంది? ఈ మిషన్ సక్సెస్ అయితే కలిగే లాభాలేంటి?