Transgenders As Traffic Volunteers: తెలంగాణలో ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా (Traffic Volunteers) నియమించాలన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో వీరి నియామక ప్రక్రియ చేపట్టారు. బుధవారం 800 మీటర్స్, 100 మీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్ నిర్వహించారు. 18 ఏళ్లు పూర్తైన వారు, టెన్త్ సర్టిఫికెట్, ట్రాన్స్‌జెండర్ సర్టిఫికెట్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ చేపట్టారు. బుధవారం 58 మంది ఈవెంట్స్‌లో పాల్గొనగా.. 44 మందికి ఎంపిక చేశారు. వీరికి ట్రాఫిక్ నిబంధనల అమలుపై శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకోనున్నారు. 


కాగా, రాష్ట్రంలో 3 వేల మందికి పైగా ట్రాన్స్‌జెండర్లుంటే.. వారిలో నగరంలోనే వెయ్యి మంది ఉన్నట్లు అంచనా. ఆసక్తి గల వారిని గుర్తించి ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని గతంలోనే సీఎం పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా నియమించనున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి 10 రోజులు ట్రాఫిక్ విధులపై శిక్షణ ఇచ్చి అనంతరం విధులు కేటాయిస్తారు. వీరికి ప్రత్యేక యూనిఫాంతో పాటుగా ప్రతీ నెలా నిర్దేశిత స్టైఫండ్ ఇవ్వనున్నారు.


Also Read: Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం