Jagan Photo On Pushpa 2 Flexi: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పుష్ప 2 (Pushpa 2) మేనియా నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సినిమా కోసం యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లు సైతం ఊహించని రీతిలో చేశారు. తాజాగా, పుష్ప 2 ఫ్లెక్సీలు సైతం వైరల్ అవుతున్నాయి. అనంతపురం గుత్తి పట్టణంలోని ఓ థియేటర్‌లో పుష్ప 2 ఫ్లెక్సీలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఫోటోను వేశారు. 'మాకోసం నువ్వు వచ్చావు.. మీ కోసం మేము వస్తాం.. తగ్గేదేలే' అంటూ ఆ పోస్టర్‌లో రాశారు. కాగా, సోషల్ మీడియాలో వైరల్ కాగా సినీ, రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, పుష్ప 2 సినిమాకు వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు, పిఠాపురంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పుష్ప 2 సినిమా పోస్టర్లను చించేశారు. దీంతో ఆందోళన నెలకొంది.
అటు, మెగా అభిమానులు పుష్ప 2 చూడొద్దంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్ ఎక్కడా మెగాస్టార్ ప్రస్తావన కానీ మెగా ఫ్యామిలీ ప్రస్తావన కానీ తీసుకురాకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే, వైసీపీ శ్రేణులు బన్నీకి మద్దతుగా నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో తన స్నేహితుడు, వైసీపీ నేత శిల్పారవి ఇంటికి వెళ్లి మద్దతుగా నిలిచారు. అయితే, ఆ సమయంలో వేలాది మంది అభిమానులు తరలిరాగా.. బన్నీతో పాటు శిల్పా రవిపై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఇటీవలే ఆ కేసును హైకోర్టు కొట్టేసింది.
'పుష్ప 2ను అడ్డుకుంటాం'
అటు, పుష్ప 2 అడ్డుకుంటామంటూ కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన జనసేన నేత చలమలశెట్టి రమేశ్ బాబు హెచ్చరించారు. 'అల్లు అర్జున్ పోకడ మెగా అభిమానులు, జన సైనికులకు చాలా బాధ కలిగించింది. మెగా ఫ్యామిలీని ఎన్నికల సమయంలో వ్యతిరేకించావ్. ప్రాణాలను లెక్కచేయకుండా పవన్ రాష్ట్రం కోసం అహర్నిశలు పని చేస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్‌ను నువ్వు గుర్తించలేదు అల్లు అర్జున్. అహంతో వ్యవహరిస్తున్నావ్ అంటూ మండిపడ్డారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుకు క్షమాపణలు చెప్పాలి. చిరంజీవి కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. ఇప్పటికైనా అల్లు అర్జున్ పద్ధతి మార్చుకోకుంటే జనసేన అభిమానులు, మెగా ఫ్యాన్స్ సినిమా విడుదలను అడ్డుకుంటాం' అని హెచ్చరించారు.
హైకోర్టులో పిటిషన్
మరోవైపు, పుష్ప 2 సినిమా విడుదలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో తాజాగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అదనపు షోలకు అనుమతి ఇవ్వడం, టికెట్ల ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలను ఇందులో సవాల్ చేశారు. పుష్ప సినిమాలో రూ.100 కోట్లు వినియోగించినట్లు ఆధారాలు సమర్పించలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రతివాదులుగా పుష్ప నిర్మాతలు, అల్లు అర్జున్, హీరోయిన్స్ శ్రీలీల, రష్మికను చేర్చారు. దీనిపై తగు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. కాగా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి.
Also Read: Kakinada MLA News: పార్టీల్లో వైసీపీ దొంగలు చేరుతారు జాగ్రత్త- కాకినాడ ఎమ్మెల్యే వనమాడి హెచ్చరిక