మంత్రి కేటీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తుండగా, మెదక్ జిల్లా తుఫ్రాన్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద కేటీఆర్ కాన్వాయ్ నిలిపేశారు. అనంతరం, పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆయన కారులో సోదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పూర్తిగా సహకరించారు. తనిఖీల అనంతరం కేటీఆర్ అక్కడి నుంచి బయలుదేరారు. కాగా, తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎక్కడికక్కడ సోదాలు చేస్తూ అక్రమ నగదును స్వాధీనం చేసుకుంటున్నారు.







ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ కామారెడ్డిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాన్వాయ్ గా వెళ్తున్నారు. ఆ సమయంలో తుఫ్రాన్ వద్ద పోలీసులు ఆయన వాహనాన్ని ఆపారు. మంత్రి వాహనం సహా కాన్వాయ్ లోని ఇతర వాహనాల్లోనూ సోదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి, సిబ్బంది వారికి పూర్తిగా సహకరించారు. 


విస్తృత తనిఖీలు


అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ అధికారులు, పోలీస్ సిబ్బంది సమన్వయంతో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తోన్న నగదు, మద్యం, బంగారం వంటి వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. కార్లను మొదలుకొని ఆర్టీసీ బస్సులు, బైకులు ఇలా వేటినీ వదలడం లేదు. ఎంతటి వారైనా, మంత్రులైనా సరే పోలీసులు వదలడం లేదు. కానుకల పంపిణీ, భారీగా నగదు తరలింపు వంటి వాటిపై అధికంగా దృష్టి సారించారు. ఇప్పటివరకూ రూ.130 కోట్లకు పైగా నగదు, బంగారం సీజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ తనిఖీలతో సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రూ.50 వేలకు మించి నగదు, ఆభరణాలు తీసుకెళ్తే తప్పనిసరిగా రశీదులు, పత్రాలు తమ వెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


అభ్యర్థుల ఖాతాల్లో ఆ నగదు


మరోవైపు, ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఈసీ అధికారులకు స్పష్టం చేసింది. ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన, పంచుతున్న డబ్బు, ఇతర సామాగ్రి పట్టుబడితే వాటిని అభ్యర్థుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. 'మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఏర్పాట్ల పరంగానూ లోపాలు వెలుగుచూశాయి. ఈసారి ఎన్నికల్లో ఆ పరిస్థితి పునరావృతం కాకూడదు.' అంటూ స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. అలాగే, ఎన్నికల సంఘం వేటు వేసిన అధికారుల స్థానంలో నియమించిన అధికారుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భద్రతా ఏర్పాట్లపైనా అప్రమత్తంగా ఉండాలన్నారు. 


Also Read: ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, ఆయనకే ఛాన్స్