West Godavari Crime News : ఒక్కడే వచ్చాడు. బ్యాగ్ నుంచి బంగారు ఆభరణాల తీస్తున్నట్టు నటించాడు. కత్తి తీశాడు. అక్కడే ఉన్న ఆరున్నర లక్షలతో ఉడాయించాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగిన ఈ దోపిడీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. 


నరసాపురంలోని రెడ్డప్పవారి వీధిలో ఉండే స్టేట్‌బ్యాంకులో జరిగిన దోపిడీ కలకలం రేపింది. ఈ బ్యాంకుకు సమీపంలో పెద్దగా జనాలు ఉండరు దాన్నే ఈ దొంగ అనుకూలంగ మార్చుకున్నాడు. మధ్యాహ్నం సమయంలో ఆ ప్రాంతంలో చిన్నపాటి వర్షం కురిసింది. అదే టైంలో బ్యాంకులో ఎవరూ లేరు. ఇద్దరు ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. బ్యాంకు మేనేజర్‌ కూడా భోజనానికి వెళ్లాడు. 


బ్యాంకులో ఎవరూ లేరని నిర్దారించుకున్న దొంగ... బ్యాగుతో లోపలికి వచ్చాడు. అక్కడే డబ్బులు లెక్కపెడుతున్న క్యాషియర్‌లు కనకదుర్గ, శిరీష్ ఉన్నారు. వారి వద్దకు వచ్చిన దొంగ తనకు బంగారంపై లోన్ కావాలని వారితో మాట కలిపాడు. తలకు టోపీ, ముఖానికి కట్చీఫ్‌ కట్టుకున్నాడు. వాటిని తీసేయాలని వారు చెప్పినా తనకు జలుబు చేసిందని చెప్పి వారిని ఏమార్చాడు. 


మాటల సందర్భంగా రుణం కావాలంటే ముందు బంగారం నాణ్యతను పరిశీలించాలని వాళ్లు వచ్చే వరకు బయట ఉండాలని చెప్పారు. ఇంతలో తన బ్యాగ్‌ నుంచి సడెన్‌గా కత్తి తీశాడు. ఆ కత్తి తీసిన వెంటనే అక్కడే ఉన్న ముగ్గురు మహిళా ఉద్యోగులు బెదిరిపోయారు. పక్కకు తప్పుకున్నారు. దీంతో అక్కడ లెక్కపెట్టడానికి ఉన్న డబ్బుల కట్టలను తన బ్యాగ్‌లో వేసుకున్నాడు. ఈ క్రమంలోన వెయ్యి రూపాయలు కిందపడిపోయాయి. 


టేబుల్‌పై 7.50 లక్షలు లెక్క పెట్టి ఉంచారు. దొంగ వారిని బెదిరించి మొత్తం తన బ్యాగ్‌లో వేసుకోబోయాడు. అయితే బ్యాగ్‌లో వేస్తున్న టైంలో వెయ్యి రూపాయల నోట్ల కట్టలు కిందపడిపోయాయి. దీంతో ఆరున్నర లక్షలతో దొంగ ఉడాయించాడు. 
చోరీ సంగతి తెలుసుకున్న స్థానిక పోలీసులు బ్యాంకును సందర్శించారు. అయితే బ్యాకులో ఉన్న సిసి కెమెరా తప్ప వేరే కెమెరాలు పని చేయడం లేదు. అసలు ఆ దొంగ ఎటు నుంచి వచ్చాడు. ఎలా వచ్చాడు. ఎటు వెళ్లాడనే వివరాలు తెలియడం లేదు. అయినా సరే దొంగను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ చోరీ కేసు ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ రవి తెలిపారు.