Train Ticket for Sankranti 2024: సంక్రాంతి.. తెలుగు లోగిళ్లలో పెద్ద పండుగ. ఉపాధి కోసం సొంతూరు వదిలి పట్టణాల్లో బతుకుతున్న ఎంతో మంది పండుగకు తమ ఊరికి వెళ్లి కుటుంబంతో సరదాగా గడపాలని అనుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి పెద్ద సంఖ్యలో తరలి వెళ్తారు. అయితే, సుదూర ప్రాంతాలకు ఇప్పటికే అన్ని రైళ్లల్లోనూ రిజర్వేషన్లు నిండిపోయాయి. ఏ రైలు చూసిన వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. ముఖ్యంగా, విజయవాడ (Vijayawada), గుంటూరు (Guntur), విశాఖ (Visakha), రాజమండ్రి ప్రాంతాలకు రైళ్లల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. గోదావరి (Godavari), ఫలక్ నుమా (Falaknuma), దురంతో, విశాఖ వందే భారత్ (Vandebharat), గరీబ్ రథ్ (Garibrath) రైళ్లల్లో సైతం రిజర్వేషన్లు ఖాళీ లేకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ ఉన్నా, ఇంకా నెల రోజుల టైం ఉండడంతో రిజర్వేషన్ దొరుకుతుందన్న ఆశతో టికెట్స్ చేసుకుంటున్నారు. ప్రధాన రైల్వే స్టేషన్లలో టికెట్ రిజర్వేషన్ కోసం వెళ్తే ఏ రైలు చూసినా వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్ ఉంటుందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని రైళ్లకు రిగ్రెట్ అని కూడా వస్తోంది. ఉత్తరాంధ్ర వైపు వెళ్లే రైళ్లకు 2 నెలల ముందే రిజర్వేషన్లు పూర్తైనట్లు తెలుస్తోంది. ప్రయాణికుల కోసం కొన్ని ప్రత్యేక రైళ్లను ద.మ రైల్వే నడుపుతున్నా అవి కూడా చాలడం లేదు. పండుగ రద్దీ దృష్ట్యా మరిన్ని రైళ్లు నడపాలని, అదనపు బోగీలు సైతం ఏర్పాటు చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు. ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్ లో పని చేస్తున్న ఉద్యోగులు, పోటీ పరీక్షలకు ఇక్కడ సిద్ధమయ్యే విద్యార్థులు అధిక సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లేందుకు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
ఆ తేదీల్లోనే
2024 జనవరి 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి పండుగ దృష్ట్యా, జనవరి 11, 12, 13 తేదీల్లో నడిచే రైళ్లు ఇప్పటికే బుకింగ్ తో నిండిపోయాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖ వైపు వెళ్లే రైళ్లు విశాఖ, గోదావరి, జన్మభూమి, ఫలక్ నుమా, వందే భారత్, ఈస్ట్ కోస్ట్, జన్మభూమి, గరీభ్ రథ్ తో పాటు చెన్నై, ముంబయి, బెంగుళూరు నుంచి ఒడిశా వైపునకు వెళ్లే రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రధాన రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కొన్ని ప్రత్యేక రైళ్లల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండడం లేదని వాపోతున్నారు. ఈసారి ఇబ్బంది లేకుండా చూడాలని పేర్కొంటున్నారు.
ఈ రైళ్లు రద్దు
మరోవైపు, కాజీపేట - వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య మూడో లైన్ పనుల కారణంగా కాజీపేట - విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. గుంటూరు - సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఈ నెల 10 నుంచి 18 వరకూ, సికింద్రాబాద్ - విజయవాడ శాతవాహన ఎక్స్ ప్రెస్ ఈ నెల 7వ తేదీతో సహా 10 నుంచి 18 వరకూ, సికింద్రాబాద్ - భద్రాచలం రోడ్డు కాకతీయ ఎక్స్ ప్రెస్ ఈ నెల 6వ తేదీతో పాటు 10 నుంచి 18 వరకూ రద్దు చేసినట్లు చెప్పారు. అలాగే, ఆదిలాబాద్ - తిరుపతి కృష్ణా ఎక్స్ ప్రెస్ ఈ నెల 5 నుంచి 19 వరకూ రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
కాజీపేట - డోర్నకల్, డోర్నకల్ - విజయవాడ ప్యాసింజర్ పుష్ ఫుల్ రైళ్లను ఈ నెల 10 నుంచి 18 వరకు, కాజీపేట - తిరుపతి, లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి రైళ్లను కూడా ఈ నెల 10 నుంచి 18 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 11 నుంచి 19 వరకు కాజీపేట వరకు మాత్రమే నడుస్తుందని తెలిపారు. భద్రాచలం రోడ్ నుంచి బల్లార్షా వెళ్లే సింగరేణి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 6 నుంచి 8 వరకు, 10 నుంచి 19 వరకు హసన్పర్తి రోడ్ వరకు మాత్రమే నడుస్తుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
Also Read: Key Announcement on AP Capital: ఏపీ రాజధాని - కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన