Heavy Rains in Telangana: మిగ్ జాం తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం 2024.4 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 - 50 కి.మీ మేర ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళవారం ఉదయం బుధవారం ఉదయం వరకూ ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అటు సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, సిద్ధిపేట జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
ఏపీలోనూ మిగ్ జాం తీవ్ర ప్రభావం
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తీవ్ర తుపానుగా మారింది. ఈ క్రమంలో ఏపీ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు సహా ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల దివిసీమ మధ్యలోనే మంగళవారం ఉదయం తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ సమయంలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. తీర ప్రాంతాల ప్రజలను, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని నిర్దేశించారు. ప్రాణ నష్టం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
వర్షాలతో ఇబ్బందులు
తుపాను కారణంగా భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అటు తిరుమలలోనూ తుపాను ప్రభావంతో భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. శ్రీకాళహస్తి సమీపంలోని స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తుపాను కారణంగా తిరుమలలోని పర్యాటక ప్రదేశాల సందర్శనను టీటీడీ అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పాటే శ్రీవారి మెట్టు మార్గంలోనూ భక్తుల రాకపోకలు నిలిపేశారు.