Mizoram Election Results:
అంచనాలు తారుమారు..
మిజోరంలో Zoram People’s Movement (ZPM) ఘన విజయం సాధించింది. బీజేపీ మిత్రపక్ష పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (Mizo National Front) అధికారంలోకి వస్తుందని భావించినా...ఆ అంచనాలు తలకిందులయ్యాయి. 40 నియోజకవర్గాలున్న మిజోరంలో 21 సీట్లు సాధించిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశముంటుంది. అయితే...ZPM మెజార్టీ మార్క్ కన్నా ఎక్కువ స్థానాల్లో గెలిచింది. మొత్తం 27 చోట్ల విజయం సాధించింది. ఎమ్‌ఎన్‌ఎఫ్ పార్టీ 10 సీట్లకే పరిమితమైంది. ముఖ్యమంత్రి జొరమ్‌తంగ ఓడిపోవడం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. ఆయన నిలబడిన చోట ZPM అభ్యర్థి 2 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక ZPM నుంచి లల్దుహోమా ముఖ్యమంత్రి (Lalduhoma) అభ్యర్థిగా ఉన్నారు. బీజేపీ రెండు చోట్ల విజయం సాధించింది. ఈ ఫలితాలపై లల్దుహోమా స్పందించారు. ఇది తాము ఊహించిందేనని స్పష్టం చేశారు. "ఈ ఫలితాల మాకేం ఆశ్చర్యం కలిగించడం లేదు. మేం అంచనా వేసిందే జరిగింది" వెల్లడించారు. ముఖ్యమంత్రి జొరంతంగ సాయంత్రం గవర్నర్‌ని కలవనున్నారు. తన రాజీనామాని సమర్పించనున్నట్టు సమాచారం. ఈ ఫలితాలను అసలు ఊహించలేదని బీజేపీ వెల్లడించింది. హంగ్ అసెంబ్లీ వస్తుందనుకున్నప్పటికీ..ఆ అవకాశం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేసింది.
"నిజానికి మేం హంగ్ వస్తుందని ఊహించాం. కానీ ఫలితాలు చూసిన తరవాత ఆ ఆలోచన పక్కన పెట్టేశాం. దీన్ని మేం అస్సలు ఊహించలేదు. ప్రజల తీర్పు ఏదైనా కచ్చితంగా మేం గౌరవిస్తాం. అంగీకరించి తీరుతాం. ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా నేతృత్వంలో మిజోరం చాలా అభివృద్ధి చెందుతోంది. 2018 ఎన్నికల్లో ఒకటే స్థానంలో గెలిచాం. ఇప్పుడు ఆ సంఖ్య పెంచుకోగలిగాం"
- వన్‌లాల్‌హుమాకా, మిజోరం బీజేపీ అధ్యక్షుడు
సరిహద్దు వివాదాలు, బెంగాల్ నుంచి అక్రమ వలసలు, స్థానిక తెగల మధ్య ఘర్షణలు లాంటి కీలక సమస్యలు ప్రతి సారీ మిజోరం ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. సరైన మౌలిక వసతులు లేకపోవడమూ ఎన్నికల్లో కీలక అంశంగా మారింది. వీటితో పాటు అవినీతి, నిరుద్యోగం లాంటి అంశాలూ ఫలితాలను ప్రభావితం చేశాయి. మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలు మిజోరం ఎన్నికలపై ప్రభావం చూపినట్టు కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే...మయన్మార్ నుంచి వలస వచ్చిన కుకి-జో కమ్యూనిటీకి చెందిన పౌరులకు ఆశ్రయం కల్పిచడం తమకు కలిసొస్తుందని MNF అంచనాలు పెట్టుకుంది. Zo unification అంశాన్ని ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించింది మిజోరం నేషనల్ ఫ్రంట్.