Cyclone Michaung News:


చెన్నైలో భారీ వర్షాలు..


చెన్నైలో భారీ వర్షాలు (Chennai Rains) దంచి కొడుతున్నాయి. నగరమంతా వరదలు ముంచెత్తుతున్నాయి. రోడ్లపై నీళ్లు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. అపార్ట్‌మెంట్‌లోలని సెల్లార్‌లలో వరద నీళ్లలో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. చాలా చోట్ల ఈదురు గాలులు వీస్తున్నాయి. భవనాలు కుప్ప కూలిపోతున్నాయి. కనాథుర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. India Meteorological Department అంచనాల ప్రకారం...తమిళనాడులో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. తిరవళ్లూరు, చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లో వచ్చే మూడు గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రణిప్పెట్టై, వేలూరు, తిరపత్తూరు, ధర్మపురి, నమక్కల్, తిరువరూర్, నాగపట్టిణం, తమిళనాడు, పుదుచ్చేరిలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది. మిగ్జాం (Michaung Cyclone) తుఫాన్ కారణంగా తమిళనాడు తీర ప్రాంతాల్లో గట్టి ప్రభావం కనిపిస్తోంది. ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీళ్లు చేరుకున్నాయి. కొన్ని చోట్ల తుఫాన్ ధాటికి చెట్లు కూలిపోయి నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. మరి కొన్ని చోట్ల కార్‌లు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వర్షాల కారణంగా రైళ్ల షెడ్యూల్‌ పూర్తిగా మారిపోయింది. కొన్నింటిని పూర్తిగా రద్దు చేశారు. 






ఏపీలోనూ ప్రభావం..


తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లోనూ (Michaung Cyclone Effect) ఈ ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు, మచిలీపట్నంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD వెల్లడించింది. చెన్నైలో మీనంబక్కంలో 196 MM వర్షపాతం నమోదైంది. నుంగబక్కంలో 154.3 MM వర్షపాతం (Heavy Rains in Chennai) రికార్డ్ అయింది. ఈ వానల కారణంగా చెన్నైలోని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీస్‌లు మూసివేశారు. ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని సూచించింది ప్రభుత్వం. తీరప్రాంతాల్లో దాదాపు 5 వేల రిలీఫ్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌ ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక చర్యల్ని పరిశీలిస్తున్నారు. 


"మిగ్జాం తుఫాన్‌ని ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. మంత్రులతో పాటు ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయిలోనే ఉన్నారు. అధికారులు చెప్పిన జాగ్రత్తలు ప్రజలందరూ పాటించాలి. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దు. ఈ తుఫాన్ ప్రభావం తగ్గిపోయేంత వరకూ అప్రమత్తంగా ఉండాలి"


- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి


Also Read: Mizoram Election Result 2023: మిజోరంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు, అధికార ప్రభుత్వానికి షాక్!