Mizoram Assembly Election Results:



లీడ్‌లో ZPM..


మిజోరం ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ ఎగ్జిట్‌ పోల్ అంచనాలకు కాస్త అటు ఇటుగానే కొనసాగుతోంది. 40 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో Zoram People's Movement (ZPM), Mizo National Front (MNF), కాంగ్రెస్, బీజేపీ బరిలోకి దిగాయి. ప్రస్తుతం మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా జోరంతంగ ఉన్నారు. ఈ సారి కూడా MNF అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. కాకపోతే గత ఎన్నికల కన్నా సీట్ల సంఖ్య కొంత తగ్గే అవకాశముందని చెప్పాయి. కానీ...ఇప్పుడు ఫలితాలను చూస్తుంటే...మొగ్గు మొత్తం జోరం పీపుల్స్ మూవ్‌మెంట్‌కే ఉన్నట్టు కనిపిస్తోంది. కౌంటింగ్‌లో దూసుకుపోతోంది ఈ పార్టీ. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటికే నాలుగు చోట్ల విజయం సాధించింది ZPM. దాదాపు 25 చోట్ల లీడ్‌లో ఉంది. 21 సీట్లలో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది. కాంగ్రెస్, బీజేపీ వెనకంజలో ఉన్నాయి. నవంబర్ 7వ తేదీన మిజోరంలో ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3వ తేదీనే ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉన్నా ఇవాళ్టికి (డిసెంబర్ 4) మార్చింది కేంద్ర ఎన్నికల సంఘం. 8.5 లక్షల మంది ఓటర్లున్న మిజోరంలో పోలింగ్ శాతం 80%గా నమోదైంది. కాంగ్రెస్ 40 చోట్ల పోటీ చేయగా...బీజేపీ 13చోట్ల తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఆమ్‌ఆద్మీ పార్టీ తొలిసారి మిజోరంలో పోటీ చేసింది. నాలుగు చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. 2018లో జరిగిన ఎన్నికల్లో NDA మిత్రపక్షమైన MNF 26 చోట్ల విజయం సాధించింది. అప్పటి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ని గద్దె దింపింది. ZPM 8 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. ఆ ఎన్నికల్లో ఓ చోట విజయం సాధించి మిజోరంలో బోణీ కొట్టింది బీజేపీ